కరోనాతో సహజీవనం చేయాల్సిందే.. కానీ నిర్లక్ష్యం వద్దుః కేసీఆర్

కరోనా వైరస్ విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే విధంగా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు.

కరోనాతో సహజీవనం చేయాల్సిందే.. కానీ నిర్లక్ష్యం వద్దుః కేసీఆర్
Follow us

|

Updated on: Jul 17, 2020 | 6:00 PM

Telangana CM KCR Review Meeting: కరోనా వైరస్ విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే విధంగా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎలప్పుడూ సంసిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్సలోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు సూచనలు ఇవ్వడమే కాకుండా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేవలం తెలంగాణలోనే లేదు. తెలంగాణలో పుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తుండటం.. అలాగే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించడంతో.. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని ఆయన అన్నారు.

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది. రాష్ట్రంలో కావాల్సిన వైద్య పరికరాలను చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్‌లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశాం. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాం. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయన్నారు.

కాగా, ప్రజలు హైరానాపడి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే చికిత్స అందిస్తున్నారన్నారు. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో పి.హెచ్.సి. స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.