స్మార్ట్ వ్యవసాయంలో పండ్లు, కూరగాయల తోటలను భూమిలో సాగు చేయడంలేదు. మట్టికి బదులుగా, మనుషుల మూత్రపిండాల చికిత్స కోసం రూపొందించిన పాలిమర్ (పాదర్శకమైన, సూక్ష్మ రంధ్రాలు ఉండే పాలిమర్ ఫిల్మ్. దానిని మూత్ర పిండాలలో రక్తాన్ని శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు) పదార్థాన్ని వాడుతున్నారు. ఆ పాలిమర్ మీదే మొక్కలు పెరుగుతాయి. నీటిని, పోషకాలను నిల్వ చేసి, మొక్కలకు అందించేందుకు ఆ ఫిల్మ్ ఉపయోగపడుతుంది. ఈ సాంకేతికతతో ఎలాంటి వాతావరణంలోనైనా కూరగాయలు సాగు చేయడంతో పాటు, సంప్రదాయ వ్యవసాయం కంటే 90% తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చు. మెరుగైన దిగుబడులు సాధించవచ్చునని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పురుగు మందులను కూడా చాలా సులువుగా మొక్కలకు అందించే వీలుంటుంది. అంతేకాదు, స్వయంగా ఈ పాలిమర్ బ్యాక్టీరియాను, వైరస్‌లను కూడా నిరోధిస్తుంది. కూలీల కొరత, పరిమిత సాగు భూమి ఉన్న జపాన్ వ్యవసాయ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
మూత్ర పిండాల డయాలిసిస్‌లో రక్తాన్ని శుభ్రం చేసేందుకు వాడే పాలిమర్ పదార్థాన్ని ఈ వ్యవసాయంలో వినియోగిస్తున్నామని జపాన్ శాస్త్రవేత్త యూచీ మోరీ తెలిపారు. దాదాపు 120 దేశాలలో రిజిస్టరైన ఈ వినూత్న ఆవిష్కరణకు ఆయన సంస్థ మెబియోల్ పేటెంట్ హక్కులు కూడా తీసుకుంది. జపాన్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) లాంటి అత్యాధునిక సాంకేతికతల సాయంతో సాగు భూములను టెక్నాలజీ కేంద్రాలుగా ఎలా మార్చేస్తున్నారో ఇది చూస్తే అర్థమవుతుంది. పంటల పర్యవేక్షణ, నిర్వహణలో కచ్చితత్వాన్ని పెంచడంలో వ్యవసాయ సాంకేతికత సమీప భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది.
యూచీ మోరీ అనుసరిస్తున్న సాంకేతిక సాగు విధానాలు జపాన్‌లోని 150 ప్రాంతాలతో పాటు, యూఏఈ లాంటి మరికొన్ని దేశాల్లోనూ ఇప్పటికే అమలవుతున్నాయి. ముఖ్యంగా సునామీ, భారీ భూకంపాలు, 2011లో సంభవించిన అణుప్రమాదాల కారణంగా వ్యవసాయ భూములు నిస్సారంగా మారిన ఈశాన్య జపాన్‌లో ఈ విధానం ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం విత్తనాలు వేయడం నుంచి పంటల కోత వరకు వివిధ పంటల్లో రైతులకు ఉపయోగపడే 20 రకాల రోబోల అభివృద్ధికి జపాన్ ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. హొక్కాయిడో విశ్వవిద్యాలయం నిపుణులతో కలిసి, యన్మార్ అనే ఇంజిన్ తయారీ సంస్థ ఒక రోబో ట్రాక్టర్‌ను రూపొందించింది. దానిని ఇప్పటికే పంట పొలాల్లో పరీక్షించారు.
సెన్సర్ల సాయంతో ఈ ట్రాక్టర్లు పనిచేస్తాయి. ముందు, వెనుక ఏమున్నాయి? ఏవైనా అడ్డుంకులు ఉన్నాయా? అన్న విషయాలను ఆ సెన్సర్ల ద్వారా ఈ స్మార్ట్ ట్రాక్టర్లు గుర్తిస్తాయి. ఒకే డ్రైవర్ ఏకకాలంలో రెండు ట్రాక్టర్లను నడపొచ్చు. జీపీఎస్, వైఫై ఫీచర్లతో, సౌర విద్యుత్‌తో నడిచే రోబోను వాహన తయారీ సంస్థ నిస్సాన్ ఈ ఏడాది మొదట్లో ఆవిష్కరించింది. కొన్నేళ్లుగా డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతోంది. పంట చేలపై పురుగు మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. దాంతో, మనిషి రోజంతా చేసే పనిని గంట, అరగంటలోనే పూర్తవుతోంది. భూమి లేకుండానే కొందరు వ్యవసాయం చేసేందుకు కూడా అధునాత టెక్నాలజీ దోహదపడుతోంది.
గ్రీన్‌హౌజ్‌లలో పండించడంతో పాటు, హైడ్రోపోనిక్స్ (ఇందులో మట్టి లేకుండానే నీటి ద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తారు) ద్వారా జపాన్‌లో పండ్లు, కూరగాయలను భారీగా పండిస్తున్నారు. ఈ విధానం ద్వారా చిబా ప్రాంతంలో మిరాయీ గ్రూప్, ప్రస్తుతం రోజూ 10,000 కట్టల పాలకూరను పండిస్తోంది. సంప్రదాయ సాగు విధానంతో పోల్చితే, వంద రెట్లు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ షెడ్లలో సెన్సర్లు ఉంటాయి. ఆ సెన్సర్ల ద్వారా వాటిలో కృత్రిమ వెలుతురును, ద్రవరూప పోషకాలను, కార్బన్‌డయాక్సైడ్ స్థాయిని, ఉష్ణోగ్రతను నియంత్రిస్తారు. కృత్రిమ వెలుతురు మొక్కలు అత్యంత వేగంగా పెరిగేలా చేస్తుంది. చీడపీడలను సులువుగా నివారించవచ్చు. అయితే, వ్యవసాయ సాంకేతికత అభివృద్ధి, వినియోగానికి జపాన్ ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం తన సొంత ఆహార అవసరాలను తీర్చడం, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిచడమే.