
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీతో పాటే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నారు. అందుకే ఒకప్పుడు పెట్రోల్ వాహనాలకు ఉండే భారీ డిమాండ్ ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల (EV) వైపే ఉందనడంలో సందేహం అక్కర్లేదు. అంతే కాకుండా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకుండా.. తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడం కూడా వీటి కొనుగోళ్లుకు మరింత బలం చేకూరుస్తుంది.
కాగా సాధారణ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అధునాతన మోడల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం ఆదా మాత్రమే కాకుండా వీటిలో ఉండే స్మార్ట్ ఫీచర్లు యువతను, ఉద్యోగులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డిజిటల్ డిస్ప్లే, మొబైల్ యాప్ కనెక్టివిటీ.. జీపీఎస్ నావిగేషన్, రివర్స్ మోడ్, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి అత్యాధునిక టెక్నాలజీ వీటిలో ఉంది. పైగా ఇంజిన్ శబ్దం, వైబ్రేషన్ లేకుండా ప్రశాంతంగా నడపవచ్చని.. రాబోయే రోజుల్లో రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు అని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్న వారికి మార్కెట్లో లెక్కలేనన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సదరు వాహనాల ఆకట్టుకునే డిజైన్లు, అదిరిపోయే ఫీచర్లను చూశాక.. రోజువారీ అవసరాలకు ఏది సరైనదో తేల్చుకోవడం కాస్త కష్టమే అని చెప్పొచ్చు. అందుకే అసలు ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా ఎంచుకోవాలి? అనే ప్రశ్న సర్వత్రా తలెత్తుతుంది. ఈ మేరకు కేవలం ఒక్క ఫీచర్ చూస్తే సరిపోదని.. బ్యాటరీ రేంజ్, పర్ఫార్మెన్స్, స్టోరేజ్, భద్రత, ఛార్జింగ్ సౌలభ్యం, ధర.. ఇలా అన్నీ చూడాలని సూచిస్తున్నారు. మీరు కూడా కొత్త ఈవీ స్కూటర్ కొనేముందు తప్పనిసరిగా చూడాల్సిన 7 కీలక అంశాలివే..
1. మైలేజ్..
రోజువారీ ఆఫీస్ లేదా ఇతర పనుల కోసం స్కూటర్ వాడేవారికి రేంజ్ చాలా ముఖ్యం. కంపెనీలు చెప్పే సర్టిఫైడ్ రేంజ్‌ను చూసి మురిసిపోకుండా, మన రోజువారీ ప్రయాణ దూరాన్ని లెక్కేసుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్, రోడ్ల పరిస్థితి, మనం నడిపే వేగం, బరువును బట్టి అసలైన రేంజ్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మన రోజువారీ అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సరిపోయే రేంజ్ ఇచ్చే మోడల్‌నే ఎంచుకోవాలి.
2. పర్ఫార్మెన్స్..
రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్‌లో స్కూటర్ ఎక్కడా తడబడకుండా దూసుకెళ్లాలి. ఇందుకోసం స్కూటర్ టాప్ స్పీడ్, రైడ్ మోడ్స్, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉన్నాయో గమనించాలి. సాధారణ ప్రయాణాల్లో బ్యాటరీ ఆదా చేసేందుకు ‘ఎకో మోడ్’, అవసరమైనప్పుడు వేగంగా దూసుకెళ్లేందుకు ‘స్పోర్ట్స్ మోడ్’ ఉన్న స్కూటర్లు చాలా సౌకర్యంగా ఉంటాయి.
3. స్టోరేజ్ స్పేస్..
రోజువారీ ప్రయాణాల్లో సీటు కింద ఉండే స్టోరేజ్ (బూట్ స్పేస్) పాత్ర చాలా కీలకం. హెల్మెట్, ఆఫీస్ బ్యాగ్, ఇంటికి కావాల్సిన సరుకులు పెట్టుకునేందుకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. సరైన డిజైన్‌తో కూడిన బూట్ స్పేస్ ఉంటే, అదనంగా బ్యాగులు తగిలించుకునే బాధ తప్పుతుంది.
4. స్మార్ట్ ఫీచర్లు..
స్కూటర్లో ఉండే టెక్నాలజీ మన ప్రయాణాన్ని సులభతరం చేయాలే తప్ప, డ్రైవింగ్ నుంచి దృష్టి మళ్లించేలా ఉండకూడదు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, స్పష్టంగా కనిపించే డిజిటల్ డిస్ప్లే, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లు రోజువారీ ప్రయాణాలను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి.
5. సేఫ్టీ ఫీచర్స్..
ఎలక్ట్రిక్ స్కూటర్లు పోల్చి చూసేటప్పుడు సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఎత్తుపల్లాల వద్ద స్కూటర్ వెనక్కి జారకుండా ఉండే ‘హిల్-హోల్డ్ అసిస్ట్’, పార్కింగ్‌లో సులభంగా వెనక్కి తీసేందుకు ‘రివర్స్ మోడ్’, యాంటీ-థెఫ్ట్ అలారం, నాణ్యమైన బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, ఇరుకు పార్కింగ్ స్థలాల్లో ఇవి ఎంతో భరోసానిస్తాయి.
6. ఛార్జింగ్ సదుపాయం..
ఛార్జింగ్ పెట్టడం అనేది మన దినచర్యలో ఒక భాగంగా కలిసిపోవాలి. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకునే వీలుందా అనేది చూడాలి. చాలామందికి రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి, ఉదయాన్నే స్కూటర్ తీయడం అలవాటు. కాబట్టి మన సమయానికి తగ్గట్టుగా వేగంగా, సురక్షితంగా ఛార్జ్ అయ్యే మోడల్ ఎంచుకోవడం ఉత్తమం.
7. ధర..
కేవలం ఎక్స్-షోరూమ్ ధర తక్కువగా ఉందని ఏదో ఒక స్కూటర్ కొనేయకూడదు. మనం పెట్టే డబ్బుకు తగ్గ విలువ లభిస్తుందా లేదా అని బేరీజు వేసుకోవాలి. బ్యాటరీ సామర్థ్యం, వారంటీ, సర్వీస్ నెట్వర్క్, బిల్డ్ క్వాలిటీ, ఫీచర్లు.. వీటన్నింటినీ కలిపి చూసినప్పుడే ఆ స్కూటర్ దీర్ఘకాలంలో మనకు ఎంతవరకు లాభదాయకమో స్పష్టమవుతుంది.