భారత మార్కెట్‌లోకి మోటరోలా పోల్డబుల్ ఫోన్! ఫీచర్లు, ధర, లాంచ్ డేట్ ఇవే?
మోటరోలా తన తదుపరి రేజర్ ఫోల్డబుల్ ఫోన్ (Razr 2026/Razr 70) టీజర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 29న లాంచ్ కానున్న ఈ మోడల్ పెద్ద కవర్ స్క్రీన్, ప్రీమియం డిజైన్‌తో ఆకట్టుకోనుంది. 120Hz AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 50MP కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది.

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరలా తన తదుపరి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ అమెరికాలో మోటరోలా Razr 2026 పేరుతో, అలాగే ఇతర మార్కెట్లలో ముఖ్యంగా భారతదేశంలో మోటరోలా Razr 70 పేరుతో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. ఏప్రిల్ 29న జరిగే ఈవెంట్‌లో దీనికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా చూస్తే మోటరోలా తన క్లాసిక్ ఫ్లిప్-ఫోన్ స్టైల్‌ను కొనసాగిస్తూ, ఈసారి మరింత ప్రీమియం టచ్‌ను జోడించింది. బ్రౌన్, గ్రీన్, పర్పుల్ వంటి కొత్త కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వెనుక భాగంలో టెక్స్చర్డ్ ఫినిష్, మెటాలిక్ ఫ్రేమ్ వంటి అంశాలు దీని లుక్‌ను మరింత స్టైలిష్‌గా మారుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌లో పెద్ద కవర్ స్క్రీన్ ఇవ్వడం ప్రధాన హైలైట్‌గా నిలుస్తోంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరాల చుట్టూ విస్తరించి ఉండి, యూజర్‌కు మరింత సౌలభ్యం కలిగించేలా రూపొందించారు.
టీజర్‌లో కనిపించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరాలు, LED ఫ్లాష్, సైడ్ మౌంటెడ్ పవర్, వాల్యూమ్ బటన్లు, USB టైప్-C పోర్ట్, అలాగే స్పీకర్ గ్రిల్ వంటి సాధారణ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా లీక్ అయిన సమాచారం ప్రకారం, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7450X ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ వంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. కెమెరా పరంగా, రెండు 50MP వెనుక కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉండవచ్చని అంచనా.
ధర విషయానికొస్తే, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 799.99 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.74,000 పైగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్‌కు సరిపడే ధరగానే భావిస్తున్నారు. మొత్తానికి పెద్ద కవర్ స్క్రీన్, ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో ఈ కొత్త రేజర్ మోడల్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో మంచి పోటీని ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారులు ఈ ఫోన్ కోసం కొంతకాలం వేచి చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
