స్మార్ట్‌ఫోన్‌లు ఒరిజినలా? డుప్లికేటా? అనేది ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు!
స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిన నేపథ్యంలో నకిలీ ఫోన్ల మోసాలు ఎక్కువవుతున్నాయి. బయటకు అసలైనవిగా కనిపించే ఈ ఫోన్‌లను గుర్తించడం కష్టం. అయితే, కొన్ని సులభమైన పద్ధతులున్నాయి. IMEI నంబర్ తనిఖీ చేయడం, సాఫ్ట్‌వేర్ లోపాలను పరిశీలించడం, బాడీ నాణ్యతను గమనించడం, హార్డ్‌వేర్ సమాచారాన్ని యాప్‌లతో సరిపోల్చడం ద్వారా నకిలీ ఫోన్‌లను సులభంగా గుర్తించి మోసపోకుండా ఉండవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మార్కెట్‌లో నకిలీ మొబైల్ ఫోన్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఖరీదైన బ్రాండ్ ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నామని చెప్పి వినియోగదారులను మోసం చేసే ఘటనలు ఎక్కువవుతున్నాయి. నకిలీ ఫోన్లు బయటకు అసలైన వాటిలాగే కనిపించడంతో చాలామంది సులభంగా మోసపోతున్నారు. అయితే కొన్ని సులభమైన తనిఖీలతో ఫోన్ అసలైనదో కాదో గుర్తించవచ్చని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
మొదటిగా ప్రతి ఫోన్‌లో ఉండే ప్రత్యేక IMEI(ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్‌ను తనిఖీ చేయాలి. ఫోన్ డయలర్‌లో *#06# నొక్కితే IMEI నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అదే నంబర్ ఫోన్ పెట్టెపై, అలాగే పరికరంపై ఉన్న స్టిక్కర్‌తో సరిపోలుతుందో లేదో చూడాలి. సంఖ్యల్లో తేడా ఉంటే ఆ ఫోన్ నకిలీ అయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించడం ముఖ్యం. నకిలీ ఫోన్లు బయటకు ఆకర్షణీయంగా కనిపించినా, వాటి సాఫ్ట్‌వేర్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. సెట్టింగ్స్‌లో వింత ఐకాన్లు, అసాధారణ ప్రకటనలు, నెమ్మదిగా పని చేయడం, యాప్‌లు సరిగా లేకపోవడం వంటి లక్షణాలు నకిలీ ఫోన్‌కు సంకేతాలుగా భావించవచ్చు.
అలాగే ఫోన్ బాడీ నాణ్యతను కూడా జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. బటన్లు వదులుగా ఉండటం, కెమెరా సరిగా అమర్చకపోవడం, లోగోలో చిన్న మార్పులు ఉండటం లేదా ప్లాస్టిక్ నాణ్యత తక్కువగా ఉండటం వంటి అంశాలు ఫోన్ డూప్లికేట్ లేదా రీఫర్బిష్డ్ అయ్యే అవకాశాన్ని సూచిస్తాయి. ఇక హార్డ్‌వేర్ సమాచారం చూపించే యాప్‌ల సహాయంతో కూడా ఫోన్ అసలుదనాన్ని గుర్తించవచ్చు. ప్రాసెసర్, RAM, స్టోరేజ్, బ్యాటరీ వంటి వివరాలను తయారీదారు అధికారిక స్పెసిఫికేషన్‌లతో పోల్చి చూడాలి. ఏవైనా తేడాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
