ఫోన్ అవసరం లేకుండానే Gemini AI సేవలు.. లైవ్ ట్రాన్స్‌లేషన్, మరెన్నో ఫీచర్లతో Google AI స్మార్ట్ గ్లాసెస్
స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకుండానే ఫొటోలు తీయడం, దారులు తెలుసుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు భాషను అనువదించుకోవడం సాధ్యమైతే టెక్నాలజీ వినియోగం మరింత సులభమవుతుంది. ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ద్వారా ఫోన్‌పై ఆధారపడటం కొంత తగ్గింది. ఇప్పుడు అదే దిశగా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. కళ్లకు ధరించే అద్దాల ద్వారానే డిజిటల్ సేవలను పొందేలా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.

కృత్రిమ మేధస్సు రోజువారీ జీవితంలో భాగమవుతున్న కొద్దీ దాన్ని మరింత సహజంగా ఉపయోగించుకునే పరికరాలపై టెక్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో Google తన Gemini AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌తో ముందుకొస్తోంది. Warby Parker, Gentle Monster, Samsung సంస్థల సహకారంతో రూపొందిస్తున్న ఈ కళ్లద్దాల్లో కెమెరా, లైవ్ ట్రాన్స్‌లేషన్, నావిగేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వీటి ధరలు, ఫీచర్లు, విడుదల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Gemini AIతో నావిగేషన్
ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను Pixel, Samsung ఫోన్లతో పాటు iPhoneలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్‌పై ట్యాప్ చేయడం లేదా Hey Gemini అని పలకడం ద్వారా ఏఐ సేవలను ఉపయోగించవచ్చు. ఎదురుగా కనిపించే వస్తువులు, వాల్ పెయింటింగ్ గురించి ప్రశ్నలు అడగడం, వస్తువులను గ్రోసరీ లిస్ట్‌లో చేర్చడం, Google Maps ద్వారా దారులు తెలుసుకోవడం వంటి పనులు చేయొచ్చు. నోటిఫికేషన్లు చూడటం, పాటలు వినడం కూడా సాధ్యమవుతుంది.
Google Translate సాయంతో ఇతర భాషల్లో మాట్లాడేవారితో సంభాషించేందుకు లైవ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం ఉంది. Gemini Guided Vision ఫీచర్ చూపు తక్కువగా ఉన్నవారికి చిన్న అక్షరాలు చదవడం, రోజువారీ వస్తువులను గుర్తించడం వంటి పనుల్లో సహాయపడుతుంది. అవసరమైతే Aira Explorer ద్వారా కెమెరా ఫీడ్‌ను శిక్షణ పొందిన వ్యక్తికి పంపి సహాయం పొందవచ్చు.
ప్రైవసీ రక్షణ
ఫొటోలు, వీడియోల కోసం ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను అందించారు. కెమెరా వినియోగం వల్ల ఇతరుల ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక నియమాలు రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. Gemini ప్రాసెస్ చేసే కెమెరా దృశ్యాలు చాట్ హిస్టరీలో సేవ్ కావని, ఏఐ శిక్షణకు లేదా ప్రకటనల కోసం ఉపయోగించబోమని పేర్కొంది. ప్రాసెసింగ్‌కు ముందు ఇతరుల ముఖాలను హైడ్ చేయడం, డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడం వంటి భద్రతా చర్యలు ఉన్నట్లు సమాచారం. కెమెరా, మైక్ అనుమతులను యూజర్లు మార్చుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు సూచిక లైట్ వెలుగుతుంది. దాన్ని కవర్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది. అవసరమైతే కళ్లద్దాలను పూర్తిగా ఆఫ్ చేసి సాధారణ అద్దాల్లా ఉపయోగించవచ్చు.
ధర విషయానికి వస్తే Gentle Monster మోడళ్ల ధరలు సుమారు రూ.42,322 నుంచి ప్రారంభమవుతుండగా, Warby Parker మోడళ్ల ధర దాదాపు రూ.37,231గా ఉంది. డిజైన్, రంగులు, లెన్స్ ఎంపికలతో పాటు కొన్ని ఫ్రేమ్‌లకు ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను ఎంచుకోవచ్చు. అమెరికా, దక్షిణ కొరియాలో ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 2026 డిసెంబర్ 10 నుంచి అమ్మకాలు మొదలవుతాయని సమాచారం. భారత్‌లో విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు.
