అలా అయితే మూడేళ్లలోనే ఎన్నికలు : చంద్రబాబు

Tdp chief Chandrababu speaks about Revers elections, అలా అయితే మూడేళ్లలోనే ఎన్నికలు : చంద్రబాబు

ఏపీలో తక్షణం ఎన్నికలొస్తే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గుంటూరులో లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ వల్ల లాభమేమిటో ప్రజలకు తెలియదు గానీ.. ప్రజలు మాత్రం రివర్స్‌లో ఎన్నికలు వస్తే బాగుంటుందని భావిస్తున్నారని తెలిపారు. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాలన సాగుతుందని, ఇప్పటి వరకు టీడీపీకి చెందిన 565 మందిపై కేసులు నమోదు చేశారని బాబు ఆరోపించారు. ప్రజలకోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాలన రివర్స్‌లో ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఆస్కారం లేదని, కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లితే మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారాన్నిచేపట్టిన నాటినుంచి ప్రతిపక్ష టీడీపీ పలు విషయాలపై నిప్పులు చెరుగుతోంది. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందంటూ టీడీపీ మండిపడుతోంది. గతంలో తాను ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూశానని, కానీ జగన్ చాలా మూర్ఖంగా పాలిస్తున్నారంటూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఘాటుగా విమర్శించారు. తాను ఎవరు చెప్పినా వినరని, తాను అనుకున్న విధంగానే వెళతారంటూ అసహాయతను కూడా వ్యక్తం చేశారు బాబు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిపోవడం వైసీపీ కుట్రలో భాగమంటూ టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా బాధితుల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పటికే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వంటి నేతలపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *