Summer Olympics 2020: కరోనా వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగనున్న ఒలింపిక్ గేమ్స్ నిర్వహరణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఒసి) నిర్వాహకులు. ముందుగా ఈ ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు, పార్టిసిపెంట్లకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న క్రీడాకారులను మాత్రమే ఈ ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ ఏడాది జులైలో ప్రారంభం కాబోయే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనే అథ్టెట్లు, ఇతర క్రీడాకారులకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి చైనీస్ ఒలింపిక్ కమిటీ ముందుకు వచ్చిందని ఐఒసీ ప్రకటించింది. సమ్మర్ ఒలింపిక్స్‌తో పాటు, బీజింగ్ వేదికగా జరుగబోయే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే వారికి కూడా టీకాలు వేస్తామని చైనీస్ ఒలింపిక్ కమిటీ చెప్పినట్లు ఐఒసీ తెలిపింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఐఒసీ అధ్యక్షుడు థామస్ బాక్ తెలిపారు. అలాగే దీనిపై జపాన్ ప్రభుత్వం సైతం అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు.
ఇదిలాఉంటే.. గతేడాది జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. జపాన్ రాజధాని టోక్యో వేదికగా సమ్మర్ ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ గేమ్స్‌లో 206 దేశాలకు చెందిన 11,091 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో 33 క్రీడలలో 339 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే.. వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ నిర్వహించనున్నారు. ఈ ఒలింపిక్స్‌లోనూ భారీగా క్రీడాకారులు పాల్గొననున్నారు. వీరందరిని దృష్టిలో పెట్టుకుని టీకా వేసేందుకు తాము సిద్ధం అని చైనీస్ ఒలింపిక్ కమిటీ ముందుకు వచ్చింది.
Also read:
Tamil Nadu Elections: నాడు నడిరోడ్డుపై తన పరువు కాపాడిన వ్యక్తికి బంపర్ ఆఫర్ ఇచ్చిన వికే శశికళ..