
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేస్ ఛాంపియన్‌షిప్‌కు సెలబ్రిటీలు తరలిస్తున్నారు. మనదేశంలో మొదటిసారిగా ఈ ఈవెంట్ జరుగుతుండడం, అందుకు మహా నగరం ఆతిథ్యం ఇవ్వడంతో సినీ, క్రీడారంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రేస్‌ను తిలకించేందుకు వస్తున్నారు. ఈ రేసులో మొత్తం 11 జట్లు పోటీపడుతుండగా.. 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి మహీంద్రా, టాటా, టీసీఎస్ పోటీ దిగ్గజ సంస్థలు బరిలోకి దిగుతున్నాయి. కాగా ఈ రేసింగ్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేస్ కోసం హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ మార్గ్ లో సుమారు 2.8 కి.మీ. పొడవైన సర్క్యూట్ ని రెడీ చేసింది. అలాగే సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఈ రేస్ ను కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. కాగా శుక్రవారం (ఫిబ్రవరి 10) ఫార్ములా- ఈ రేస్ ప్రాక్టీస్ జరగ్గా.. ఇవాళ (ఫిబ్రవరి 11) ఉదయం క్వాలిఫయింగ్ రేస్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేసు ప్రారంభం కాబోతుంది. దాదాపు గంటన్నర పాటు ఈ రేసు జరగనుంది.
ఈ క్రమంలో ఫార్ములా- ఈ రేసింగ్ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు సెలబ్రిటీలు తరలివస్తున్నారు. శుక్రవారం నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్మీప్రణతి, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ తదితరలు ఈ రేస్‌లో సందడి చేశారు. ఇక ఇవాళ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మంత్రి కేటీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రికెటర్ శిఖర్ ధావన్, మహేశ్ తనయుడు గౌతమ్ తదితరులు రేసింగ్ పోటీలకు హాజరయ్యారు. కాగా ఈ రేసుకోసం చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు సచిన్. రామ్ చరణ్‌తో కలిసి ఆయన ఫార్ములా-ఈ రేస్ వద్ద సందడి చేశారు. ప్రస్తుతం సచిన్, రామ్ చరణ్ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..