PKL 2024: సమవుజ్జీలుగా మాజీ చాంపియన్లు.. యూ ముంబా, బెంగాల్‌ వారియర్స్‌ మ్యాచ్‌ టై

|

Oct 26, 2024 | 9:32 PM

Pro Kabaddi League Season 11 | U Mumba vs Bengal Warriorz: మాజీ చాంపియన్లు యూ ముంబా, బెంగాల్‌ వారియర్స్‌ సమవుజ్జీలుగా నిలిచాయి. ప్రొ కబడ్డీ సీజన్ 11లో రెండు జట్ల మధ్య ఉత్కంఠగా సాగిన లీగ్‌ మ్యాచ్‌ టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన పోరులో ఆఖరు కూత వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌ 31-31తో టైగా ముగిసింది.

PKL 2024: సమవుజ్జీలుగా మాజీ చాంపియన్లు.. యూ ముంబా, బెంగాల్‌ వారియర్స్‌ మ్యాచ్‌ టై
U Mumba Vs Bengal Warriorz
Follow us on

హైదరాబాద్‌, 26 అక్టోబర్‌ 2024 : మాజీ చాంపియన్లు యూ ముంబా, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య ఉత్కంఠగా సాగిన లీగ్‌ మ్యాచ్‌ టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ పోరులో ఆఖరు కూత వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌ 31-31తో టైగా ముగిసింది. ప్రథమార్థంలో బెంగాల్‌ వారియర్స్‌ ఏడు పాయింట్ల ఆధిక్యం సాధించినా.. ద్వితీయార్థంలో యూ ముంబా పుంజుకుంది. ఆఖరు నిమిషం వరకు ఆధిక్యంలో నిలిచిన యూ ముంబా.. చివరి కూతకెళ్లి రెయిడర్‌తో పాటు విజయాన్ని చేజార్చుకుంది. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మణిందర్‌ సింగ్‌ (8 పాయింట్లు), మయూర్‌ (6 పాయింట్లు), నితేశ్‌ కుమార్‌ (4 పాయింట్లు) మెరువగా.. యూ ముంబా ఆటగాళ్లలో మంజిత్‌ (7 పాయింట్లు), సోంబీర్‌ (5 పాయింట్లు), రోహిత్‌ (4 పాయింట్లు) రాణించారు. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో యూ ముంబా, బెంగాల్‌ వారియర్స్‌లు మూడేసి మ్యాచులు ఆడగా.. ఓ విజయం, ఓ ఓటమి సహా ఓ మ్యాచ్‌ను టై చేసుకున్నాయి.

వారియర్స్‌ మెరుపుల్‌ :

యూ ముంబాతో మ్యాచ్లో బెంగాల్‌ వారియర్స్‌ మెరుపు ప్రదర్శన చేసింది. తొలి కూతలోనే మణిందర్‌ సింగ్‌ సూపర్‌ రెయిడ్‌తో అదరగొట్టాడు. అక్కడ్నుంచి బెంగాల్‌ వారియర్స్‌ జోరు కొనసాగుతూనే ఉంది. యూ ముంబా తరఫున మంజిత్ మెరిసినా ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభించలేదు. మణిందర్‌ సింగ్‌కు సుశీల్‌, నితిన్‌ జత కలవటంతో బెంగాల్ దూకుడు పెంచింది. ప్రథమార్థంలోనే యూ ముంబాను ఓ ఆలౌట్‌ చేసింది. దీంతో తొలి 20 నిమిషాల ఆట అనంతరం బెంగాల్‌ వారియర్స్‌ 20-13తో యూ ముంబాపై ఏడు పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. యూ ముంబా డిఫెన్స్‌లో తేలిపోయింది.

U Mumba Vs Bengal Warriorz

పుంజుకున్న యూ ముంబా :

ద్వితీయార్థంలో యూ ముంబా పుంజుకుంది. తొలి పది నిమిషాల్లోనే పాయింట్ల అంతరం 2 పాయింట్లకు తీసుకొచ్చిన యు ముంబా.. ఆ తర్వాత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెయిడర్‌ మంజిత్‌ ఓ వైపు పాయింట్ల వేట సాగించగా.. డిఫెన్స్‌లో సుశీల్‌ కుమార్‌, పర్వేజ్‌, రింకూలు ఓ పట్టు పట్టారు. దీంతో మరో 4 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా యూ ముంబా ముందంజ వేసింది. ఆలౌట్‌ పాయింట్లతో యూ ముంబా 31-29తో దూసుకెళ్లింది. ఆఖరు నిమిషంలో బెంగాల్‌ పుంజుకుని 30-31తో రేసులోకి వచ్చింది. ఆఖరు కూతలో యూ ముంబా రెయిడర్‌ రోహిత్‌ రాఘవ్‌ను ట్యాకిల్‌ చేసిన బెంగాల్‌ వారియర్స్‌ స్కోరు 31-31తో సమం చేసింది.

U Mumba Vs Bengal Warriorz3

U Mumba Vs Bengal Warriorz