Argentina: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్‌లో ఆడేందుకు సిద్ధమైన మెస్సీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

|

Nov 20, 2024 | 7:06 AM

Argentina National Football Team In Kerala: ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం కేరళ ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచకప్ విజేతగా నిలిచిన అర్జెంటీనా జట్టు కేరళలో ఆడేందుకు సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Argentina: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్‌లో ఆడేందుకు సిద్ధమైన మెస్సీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
Argentina National Football Team In Kerala
Follow us on

Argentina National Football Team In Kerala: ఫుట్‌బాల్ అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నివేదిక ప్రకారం, అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు 2025లో కేరళలో ఆడనుంది. జట్టుకు నిధులు స్పాన్సర్‌షిప్ ద్వారా అందించనున్నారు. అర్జెంటీనా జట్టు కేరళలో రెండు కీలక మ్యాచ్‌లు ఆడనుంది. తిరువనంతపురం, కొచ్చి ఈ మ్యాచ్‌లకు వేదిక కానున్నాయి. రాష్ట్రానికి చేరుకోవడానికి అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ అనుమతి లభించినట్లు సమాచారం. అర్జెంటీనా జట్టు కేరళకు వచ్చేందుకు అయ్యే ఖర్చు దాదాపు రూ. 100 కోట్లు అని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ జట్టుతో ఉంటాడా లేదా అనేది అస్పష్టంగా ఉంది. మెస్సీ ఆడతాడా లేదా అనేది అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్ణయిస్తుంది. కేరళలో జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఎవరిని ఢీకొంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఫిఫా టాప్ 50లో ఉన్న జట్టుతో అర్జెంటీనా తలపడనుందని సమాచారం. కేరళలో అర్జెంటీనాతో ఆసియా దిగ్గజాలు పోటీపడనున్నాయి. జపాన్ (15), ఇరాన్ (19), దక్షిణ కొరియా (22), ఆస్ట్రేలియా (24), ఖతార్ (46) ర్యాంకింగ్‌లో ముందున్నాయి.

నేడు క్రీడల మంత్రి వి.అబ్దురహ్మాన్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం దేశమంతా ఎదురుచూస్తోన్న అద్భుతమైన వార్త రానుంది. అర్జెంటీనా జట్టు కేరళ చేరుకోనుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్ విజేత అర్జెంటీనా స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడేందుకు చేసిన ఆహ్వానాన్ని భారత ఫుట్‌బాల్ సంఘం గతంలో తిరస్కరించింది. ఈ క్రమంలో తాజాగా క్రీడా శాఖ మంత్రి వి.అబ్దుర్‌రహిమాన్‌, జట్టును ఫ్రెండ్లీ మ్యాచ్‌ కోసం కేరళకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. అర్జెంటీనా జట్టును దేశానికి తీసుకురావడానికి అయ్యే అధిక ఖర్చును భరించలేమని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆహ్వానాన్ని తిరస్కరించింది.

2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెలిచిన అర్జెంటీనా..

ప్రపంచకప్ సందర్భంగా కేరళలో అర్జెంటీనా అభిమానుల ఉత్సాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2011లో మెస్సీ సహా అర్జెంటీనా జట్టు కోల్‌కతాలో ఆడింది. అర్జెంటీనా జట్టును కేరళకు తీసుకురావడానికి ఎంత ఖర్చు అయినా, చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని అభిమానులు చాలాసార్లు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు క్రీడాశాఖ ప్రకటనతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుందని తెలుస్తోంది. మెస్సీ కూడా కేరళకు వస్తే అభిమానుల సంతోషం రెట్టింపు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..