భారత పురుషుల హాకీ జట్టు సీనియర్ ఆటగాడు బీరేందర్ లక్రా వివాదాల్లో చిక్కుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న లక్రా.. ఓ వ్యక్తిని చంపిన ఘటనపై సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బీరేంద్ర లక్రా తన చిన్ననాటి స్నేహితుడిని చంపాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈమేరకు మృతుడి తండ్రి సంచలన ఆరోపణలు చేశాడు. అలాగే ఒడిశా పోలీసులు ఆ ఆటగాడికి రక్షణ కల్పిస్తున్నారని మృతుడి తండ్రి ఆరోపించాడు.
వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆనంద్ టోప్పో అనే వ్యక్తి మరణించాడు. ఈ కేసులో ఇప్పుడు ఆనంద్ స్నేహితుడు, భారత హాకీ స్టార్ లక్రా హత్యలో ప్రమేయం ఉందని అతని తండ్రి ఆరోపించారు. లక్రా ఒడిశా పోలీసు డిపార్ట్మెంట్‌లో డీఎస్పీగా ఉన్నందున భువనేశ్వర్ పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
సమాచారం ప్రకారం, బీరేంద్ర, ఆనంద్ స్నేహితులు మాత్రమే కాకుండా ఒకే ఫ్లాట్‌లో నివసించేవారు. ఫిబ్రవరిలో అదే ఫ్లాట్‌లో శవమై కనిపించాడు. ఆనంద్ తండ్రి బంధన్ టోప్పో తన కుమారుడి మరణం గురించి మాట్లాడుతూ, “మేము, బీరేంద్ర ఇరుగుపొరుగువాళ్లం. కాబట్టి సహజంగా ఆనంద్ అతని చిన్ననాటి స్నేహితుడు” ఫిబ్రవరి 28 న, బీరేంద్ర నుంచి మాకు కాల్ వచ్చింది. ఆనంద్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆనంద్ ఇక లేడని చెప్పాడని’ తెలిపాడు.