మధ్యప్రాచ్యంలో జరగనున్న మొదటి ఫుట్‌బాల్ ప్రపంచకప్ కోసం ఇప్పటివరకు 24.50 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఫిఫా గురువారం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. టిక్కెట్ల విక్రయాల చివరి దశలో (జులై 5 నుంచి 16 వరకు) 5 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఫిఫా తెలిపింది. ఈ సంవత్సరం ఖతార్‌లో ఫిఫా ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. FIFA తన ప్రకటనలో, అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన 5 మ్యాచ్‌లను కూడా పేర్కొంది. ఈ మ్యాచ్‌లలో కామెరూన్ vs బ్రెజిల్, బ్రెజిల్ vs సెర్బియా, పోర్చుగల్ vs ఉరుగ్వే, కోస్టారికా vs జర్మనీ, ఆస్ట్రేలియా vs డెన్మార్క్ ఉన్నాయి. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ప్రజలు టిక్కెట్లు కొనడానికి ఆసక్తిని కనబరిచారంట.
ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా, మెక్సికో, ఇంగ్లండ్, అర్జెంటీనా, బ్రెజిల్, వేల్స్, ఆస్ట్రేలియా నుంచి ఫుట్‌బాల్ అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు ఫిఫా తెలిపింది. ఈ దేశాల నుంచే గరిష్ట సంఖ్యలో టిక్కెట్లు బుక్ అయ్యాయని పేర్కొంది.
టికెట్ విక్రయాల తదుపరి దశ ఎప్పుడు?
FIFA వరల్డ్ కప్ 2022 టిక్కెట్ల కోసం మరికొన్ని ప్రకటనలు రావాల్సి ఉంది. ఆ తర్వాత సెల్ దశ సెప్టెంబర్ చివరిలో ప్రకటించనున్నారు. దీని తర్వాత, ‘లాస్ట్ మినిట్ సేల్స్ ఫేజ్’ ప్రారంభంతో పాటు, ‘ఓవర్ ది కౌంటర్ సేల్’ కూడా దోహాలో ప్రారంభించనున్నారు.
తొలి మ్యాచ్ నవంబర్ 20న..
FIFA వరల్డ్ కప్ 2022 మొదటి మ్యాచ్ నవంబర్ 20న ఆతిథ్య దేశం ఖతార్ వర్సెస్ ఈక్వెడార్ మధ్య జరగనుంది. సాధారణంగా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లు జూన్-జులైలో జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఖతార్‌లో భయంకరమైన వేడి ఉంటుంది. అందుకే నవంబర్‌లో ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నారు.