FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు పొగ గండం.. మ్యాచ్‌ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మేనేజ్‌మెంట్

FIFA World Cup 2026 : కెనడా అడవుల కార్చిచ్చుల పొగతో న్యూయార్క్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినా, ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌ను వాయిదా వేయడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. మ్యాచ్ అనుకున్న సమయానికే జరగనుండగా, ఆటగాళ్ల ఆరోగ్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు పొగ గండం.. మ్యాచ్‌ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మేనేజ్‌మెంట్
Fifa World Cup 2026 (2)

Updated on: Jul 18, 2026 | 1:10 PM

FIFA World Cup 2026 : 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అయితే కెనడా అడవుల్లో చెలరేగిన భారీ కార్చిచ్చుల కారణంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ దట్టమైన పొగ ప్రభావం ఆదివారం జరగబోయే మహా ఫైనల్ మ్యాచ్‌పై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌ను నిర్వహించడానికే ఫిఫా మొగ్గు చూపుతోంది. వాతావరణం బాగోలేకపోయినా ఫైనల్ మ్యాచ్‌ను వేరే ప్రాంతానికి మార్చే ఆలోచన ఏదీ లేదని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ సమస్యపై అధికారుల మధ్య కొన్ని ప్రాథమిక చర్చలు జరిగినప్పటికీ, మ్యాచ్ వాయిదా వేయడం లేదా మార్చడంపై ఎలాంటి అధికారిక సమావేశాలు జరగలేదు.

న్యూయార్క్‌లో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

ప్రస్తుతం అమెరికాలోని మియామిలో ఉన్న ఫిఫా కమాండ్ సెంటర్ నుంచి అధికారులు వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం నేషనల్ వెదర్ సర్వీస్ సిబ్బందిని కూడా అక్కడ రంగంలోకి దించారు. అమెరికా వాతావరణ అంచనా కేంద్రానికి చెందిన సీనియర్ ఫోర్‌కాస్టర్ బాబ్ ఒరావెక్ మాట్లాడుతూ.. శనివారం నాడు న్యూయార్క్ నగరంలో పొగ తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉందని, అయితే ఆదివారం నాటికల్లా వాతావరణం క్లియర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గత గురువారం నాడు న్యూయార్క్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 208గా నమోదైంది. ఇది మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాక్టీస్ సమయంలో పొగ వాసన

ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న స్పెయిన్ జట్టు న్యూజెర్సీలోని ఈస్ట్ హనోవర్‌లో గురువారం నాడు అత్యంత కాలుష్య వాతావరణంలోనే ఓపెన్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ మైకెల్ మెరినో మీడియాకు వివరించారు. తాము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పొగ వాసన స్పష్టంగా తెలిసిందని, అయితే ప్రపంచకప్ ఫైనల్ లాంటి అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇలాంటి బాహ్య పరిణామాలను పట్టించుకోకుండా ఆటపైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. అయితే కాలుష్యం ఇంత దారుణంగా ఉన్నప్పుడు స్పెయిన్ జట్టు ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేదని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అవుట్‌డోర్ ప్రాక్టీస్‌పై హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఆందోళన

వాతావరణంలో పొగ తీవ్రత కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, అది ఆటగాళ్ల శారీరక సామర్థ్యంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మెడిసిన్ ప్రొఫెసర్ శాంతల్ డార్కెన్ మాట్లాడుతూ.. కాలుష్య గాలిలో ఫుట్‌బాల్ లాంటి తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడినప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది ఆటగాళ్ల పర్ఫార్మెన్స్‌ను దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు కొపర్నికస్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్ సీనియర్ శాస్త్రవేత్త మార్క్ పారింగ్టన్ మాట్లాడుతూ.. శనివారం అడవుల్లో మంటల తీవ్రత గనక పెరిగితే వాతావరణంలోకి మరింత పొగ చేరి ఆదివారం నాటి మ్యాచ్ సమయానికి న్యూయార్క్ పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

సోషల్ మీడియాలో కెనడాపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్

అమెరికాను చుట్టుముట్టిన ఈ ఘోర వాయు కాలుష్య సమస్యపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కెనడా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి కెనడానే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. “అత్యంత మురికి, కాలుష్య, అనారోగ్యకరమైన గాలితో అమెరికా సరిహద్దులపై అనవసరంగా దాడి జరుగుతోంది. ఇలాంటి ప్రమాదకరమైన వాయు నాణ్యత అమెరికన్లకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు” అంటూ ట్రంప్ ఘాటుగా ట్వీట్ చేశారు. రాజకీయంగా ఈ వివాదం ముదురుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం అనుకున్న సమయానికే జరగనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us