FIFA World Cup 2026 : టోర్నీ మొత్తంలో ఒక్క గోల్ లేకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రి సరికొత్త రికార్డు

FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ కెప్టెన్ రోడ్రి ఒక్క గోల్ చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించాడు. ఫెర్రాన్ టొర్రెస్ విన్నింగ్ గోల్‌తో అర్జెంటీనాను ఓడించిన స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మెస్సీ కల చెదిరిపోగా ఎన్జొ రెడ్ కార్డ్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది.

FIFA World Cup 2026 : టోర్నీ మొత్తంలో ఒక్క గోల్ లేకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రి సరికొత్త రికార్డు
Fifa World Cup 2026

Updated on: Jul 20, 2026 | 12:30 PM

FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలన్న అర్జెంటీనా కల కలగానే మిగిలిపోయింది. ఫుట్‌బాల్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం రెండు దేశాలు (బ్రెజిల్, ఇటలీ) మాత్రమే వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకోగలిగాయి. లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా మూడో జట్టుగా ఈ చరిత్ర సృష్టించేలా కనిపించినప్పటికీ, ఫైనల్ పోరులో స్పెయిన్ ఆధిపత్యం ముందు అర్జెంటీనా చేతులెత్తేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ ఆటగాళ్లు మైదానంలో నిరంతర దాడి చేస్తూ అర్జెంటీనాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశారు.

స్పెయిన్ కెప్టెన్ రోడ్రి సరికొత్త రికార్డు

ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ విభాగం చూపించిన ప్రదర్శన మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్పెయిన్ కెప్టెన్ రోడ్రి ఆధ్వర్యంలో వారి మిడ్‌ఫీల్డ్ బంతిపై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ టోర్నీ మొత్తంలో రోడ్రి ఒక్క గోల్ కూడా చేయనప్పటికీ, ఫైనల్‌తో సహా ప్రతి మ్యాచ్‌లోనూ ఆటను నడిపిస్తూ, డిఫెన్స్‌కు కొండంత అండగా నిలవడంతో ఆయనను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్(గోల్డెన్ బాల్) అవార్డు వరించింది. బెల్జియం మినహా ఈ టోర్నీలో ఏ జట్టు కూడా స్పెయిన్‌పై గోల్ చేయలేకపోయిందంటే రోడ్రి నేతృత్వంలోని డిఫెన్స్ శ్రేణి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

90 నిమిషాల పాటు కొండలా నిలబడ్డ గోల్‌కీపర్ మార్టినెజ్

అర్జెంటీనా జట్టు అత్యధికంగా కెప్టెన్ లియోనెల్ మెస్సీపైనే ఆధారపడటంతో స్పెయిన్ పక్కా వ్యూహంతో మెస్సీని కట్టడి చేసింది. అయినప్పటికీ, అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ స్పెయిన్ చేసిన అనేక గోల్ ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకుంటూ 90 నిమిషాల నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా పడకుండా చూసుకున్నాడు. కానీ ఎక్స్‌ట్రా టైమ్‌కు వచ్చేసరికి అర్జెంటీనా ఆటగాళ్లలో తీవ్రమైన అలసట స్పష్టంగా కనిపించింది. దానికి తోడు జట్టు కేవలం డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తూ, అటాకింగ్ ఆడే అవకాశాలను పూర్తిగా కోల్పోయింది.

అర్జెంటీనా ఓటమికి అసలు విలన్ అతడేనా?

ఈ ఓటమికి ఏ ఒక్క ఆటగాడిని బాధ్యుడిని చేయలేకపోయినప్పటికీ, మిడ్‌ఫీల్డర్ ఎన్జొ ఫెర్నాండెజ్ చేసిన తీవ్రమైన పొరపాటే మ్యాచ్‌ను స్పెయిన్ వైపు తిప్పేసింది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసిన తర్వాత కూడా ఎన్జొ ప్రత్యర్థి ప్లేయర్‌పై అనవసరమైన ఫౌల్ చేశాడు. దీంతో రెఫరీ అతనికి రెండో ఎల్లో కార్డ్ (రెడ్ కార్డ్) చూపించి మైదానం నుంచి బయటకు పంపేశారు. మొదటి ఎల్లో కార్డ్ వివాదాస్పదమైనప్పటికీ, రెఫరీతో కోపంగా మాట్లాడటం వల్లే అతనికి ఆ కార్డ్ ఇచ్చారు. దీనివల్ల ఎక్స్‌ట్రా టైమ్‌లో అర్జెంటీనా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.

106వ నిమిషంలో ఫెర్రాన్ టొర్రెస్ విన్నింగ్ గోల్

అర్జెంటీనా మైదానంలో 10 మందితో మాత్రమే ఉండటాన్ని స్పెయిన్ పూర్తిగా వాడుకుంది. మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ పోరో బంతిని గోల్ పోస్ట్ దగ్గరకు పాస్ చేయగా, విలియమ్స్ ఆర్థర్ దానిని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో మిగతా ముగ్గురు అర్జెంటీనా డిఫెండర్లు మిగ్యుయెల్ మోరెనోను కవర్ చేయడానికి వెళ్లగా, ఫెర్రాన్ టొర్రెస్ వైపు ఖాళీగా ఉండిపోయింది. దీంతో ఫెర్రాన్ టొర్రెస్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి విజయాన్ని ఖాయం చేశాడు. ఒకవేళ ఎన్జొ రెడ్ కార్డ్‌తో బయటకు వెళ్లకుండా 11 మంది ఆటగాళ్లు ఉండి ఉంటే, టొర్రెస్‌ను కవర్ చేసే అవకాశం ఉండేదని, ఆ గోల్ పడి ఉండేది కాదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us