క్రికెట్ ప్రేమికుల పండగకు వేళైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు గురువారం తెరలేవనుంది. 12వ ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు బుధవారమే జరగనున్నాయి. సెంట్రల్ లండన్‌లోని ప్రఖ్యాత వెస్ట్‌మిన్‌స్టర్ రోడ్‌లోని ‘ది మాల్’ వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రారంభోత్సవ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సంగీతం, క్రీడల కలబోతగా సాగే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్షంగా నాలుగువేల మంది వీక్షించనున్నారు. ఈ వేడుకలు పలు చానెళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. గురువారం ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ సమరం మొదలవనుంది.