
Virat Kohli Records: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు ఉంది. సచిన్ తన వన్డే కెరీర్‌లో 51, టెస్టుల్లో 49 సెంచరీలు సాధించారు. అయితే జట్టు విజయంలో భాగమైన సెంచరీల విషయానికి వస్తే మాత్రం సచిన్ టెండూల్కర్ కాకుండా మరో భారత దిగ్గజ బ్యాటర్ అగ్రస్థానంలో నిలిచాడు. జట్టు విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం.
సచిన్ను అధిగమించిన విరాట్ కోహ్లీ
సచిన్ టెండూల్కర్ సాధించిన మొత్తం 100 సెంచరీలలో 53 సెంచరీలు భారత్ గెలిచిన మ్యాచ్‌లలో రాగా, మిగిలిన 47 సెంచరీలు టీమిండియా ఓడిపోయిన లేదా డ్రా అయిన మ్యాచ్‌లలో వచ్చాయి. దీంతో సచిన్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. కాగా రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 85 సెంచరీలు బాదగా, అందులో ఏకంగా 59 సెంచరీలు భారత జట్టు విజయాల్లోనే రావడం గమనార్హం. ఈ అద్భుత గణాంకాలతో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నంబర్-1 స్థానంలో నిలిచాడు.
రెండో స్థానంలో రికీ పాంటింగ్
ఈ ప్రపంచ రికార్డుల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నారు. పాంటింగ్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలిచిన మ్యాచ్‌లలో మొత్తం 55 సెంచరీలు సాధించారు.
టాప్-5లో స్థానం సంపాదించిన రోహిత్ శర్మ
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో భారతీయ బ్యాటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 51 సెంచరీలు చేసిన రోహిత్, అందులో 41 సెంచరీలను భారత జట్టు గెలిచిన మ్యాచ్‌లలో సాధించి టాప్-4లో నిలిచాడు. రోహిత్ సాధించిన సెంచరీలలో కేవలం 10 మాత్రమే జట్టు ఓటమి చెందిన మ్యాచ్‌లలో వచ్చాయి. ఇక సౌతాఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా తన కెరీర్‌లోని 55 సెంచరీలలో 40 సెంచరీలు జట్టు విజయాల్లో సాధించి ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
జట్టు విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 ప్లేయర్లు:
* విరాట్ కోహ్లీ (భారత్): 59 సెంచరీలు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 55 సెంచరీలు
* సచిన్ టెండూల్కర్ (భారత్): 53 సెంచరీలు
* రోహిత్ శర్మ (భారత్): 41 సెంచరీలు
* హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా): 40 సెంచరీలు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..