ఓరేయ్ బుడ్డోడా.. అతనిలా అస్సలు మారకురోయ్.. వైభవ్‌ను హెచ్చరించిన కపిల్ దేవ్..!
Vaibhav Suryavanshi: పదిహేనేళ్లకే టీమిండియాలో చోటు.. అంతకుముందే ఐపీఎల్‌లో సంచలన రికార్డు.. అండర్-19 క్రికెట్‌లో విధ్వంసక బ్యాటింగ్..! ఇలా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు భారత క్రికెట్‌లో మార్మోగుతోంది. అయితే ఈ యువ సంచలనంపై దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం ప్రశంసలతో పాటు ఓ కీలక హెచ్చరిక చేశారు. వైభవ్ భవిష్యత్తును ఇప్పుడే నిర్ణయించొద్దని స్పష్టం చేశారు.

Team India: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పటికే తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ (IPL)లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరనపు ఓపెనర్‌గా ఆడుతున్న వైభవ్.. భారత అండర్-19 జట్టులోనూ తన సత్తా చాటాడు. ముఖ్యంగా అండర్-19 వరల్డ్‌కప్-2025 ఫైనల్లో ఇంగ్లండ్‌పై అతడి బ్యాటింగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు బాదిన వైభవ్.. భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్‌లోనూ అదిరిపోయే ప్రదర్శన..
అక్కడితో ఆగలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ వరుస విజయాల ప్రభావంతో కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టీ20 జట్టులో ఓపెనర్‌గా తన స్థానాన్ని బలపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఎక్కువమంది చదివినది: నెట్స్‌లో బుడ్డోడి ఊచకోత.. తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..?
కపిల్ దేవ్ మాత్రం ఎందుకు అలా అన్నారంటే..?
వైభవ్‌పై దేశీయ, విదేశీ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్ సూపర్‌స్టార్‌గా అతడిని అభివర్ణిస్తున్నారు. అయితే భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ (Kapil Dev) మాత్రం ఈ విషయంలో కొంత భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైభవ్‌కు ప్రతిభ లేదని ఆయన చెప్పలేదు. అసలు సమస్య అతడిపై ఇప్పుడే భారీ అంచనాలు పెట్టడమేనని సూచించారు.
“వైభవ్ విషయంలో తొందరపాటు వద్దు. అతడి గురించి ఇప్పుడే అంచనా వేయడం సరికాదు. అతడికి సామర్థ్యం ఉందా? అంటే కచ్చితంగా ఉంది. కానీ ఇలాంటి ప్రతిభతో వచ్చిన చాలామంది క్రికెటర్లు తర్వాత కనుమరుగయ్యారు” అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.
వినోద్ కాంబ్లీని ఉదాహరణగా ఎందుకు చెప్పాడంటే?
తన అభిప్రాయాన్ని వివరించేందుకు కపిల్ దేవ్ మాజీ భారత బ్యాటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) కెరీర్‌ను ఉదాహరణగా ప్రస్తావించారు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభతో వెలుగులోకి వచ్చిన కాంబ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారీ అంచనాలు పెంచాడు. అయితే ఆ స్థాయి ప్రతిభను దీర్ఘకాలం కొనసాగించలేకపోయాడు. అందుకే వైభవ్ విషయంలో ఇప్పుడే ‘తదుపరి సూపర్‌స్టార్’, ‘తదుపరి విరాట్ కోహ్లీ’ అంటూ తీర్పులు ఇవ్వడం సరైంది కాదని కపిల్ దేవ్ సూచించారు.
ఎక్కువమంది చదివినది: ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
“మరో మూడేళ్లు సమయం ఇవ్వాలి”
వైభవ్ ప్రస్తుతం 15-16 ఏళ్ల వయసులో ఉన్నాడని గుర్తు చేసిన కపిల్ దేవ్.. కనీసం మరో మూడేళ్లు అతడిని గమనించాలని చెప్పారు. వయసు పెరిగే కొద్దీ జీవనశైలి, ఆలోచనా విధానం, ఆటపై దృక్పథం మారే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రస్తుత స్థాయి ఆటను కొనసాగించగలడా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ప్రతిభ ఒక్కటే సరిపోదు..!
కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల్లో అసలు పాయింట్ ఇదే. క్రికెట్‌లో ప్రతిభ ఎంత ముఖ్యమో.. దాన్ని నిలబెట్టుకునే క్రమశిక్షణ, జీవనశైలి కూడా అంతే ముఖ్యం. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌కు సేవలందించడానికి వారి ప్రతిభతో పాటు క్రమశిక్షణ, ఆటపై అంకితభావం కీలకంగా నిలిచాయి.
వైభవ్‌కు ఇప్పుడు భారీ అవకాశం ఉంది. అతడి వయసులోనే వచ్చిన అపారమైన గుర్తింపు భవిష్యత్తులో మరింత ఒత్తిడిని కూడా తీసుకురావచ్చు. ఆ అంచనాలను ఎలా ఎదుర్కొంటాడు? తన ఆటను ఎలా అభివృద్ధి చేసుకుంటాడు? అన్నదే అసలు పరీక్ష.
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనలు ఇప్పటివరకు అద్భుతమే. కానీ కపిల్ దేవ్ చెప్పినట్టు ఒకటి, రెండు సీజన్ల ప్రదర్శనలతో ఒక ఆటగాడి మొత్తం కెరీర్‌ను నిర్ణయించలేం. భారత క్రికెట్‌కు మరో సూపర్‌స్టార్ దొరికాడా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి వైభవ్‌పై అంచనాల కంటే అతడి ఆటను ఆస్వాదించడం, అతడికి ఎదిగే అవకాశం ఇవ్వడమే మంచిది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
