
Umpire David Shepherd Standing on One Leg Nelson Score: క్రికెట్ మైదానంలో స్కోరు బోర్డుపై ఆ సంఖ్య కనిపించగానే దిగ్గజ అంపైర్ డేవిడ్ షెపర్డ్ విచిత్రంగా ప్రవర్తించేవారు. ఒక కాలును గాల్లోకి లేపి నిలబడేవారు. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచిన ఈ విన్యాసం వెనుక దశాబ్దాల నాటి బలమైన నమ్మకం దాగుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్‌గా విశేష సేవలందించిన దిగ్గజం డేవిడ్ షెపర్డ్. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్కోరు బోర్డుపై జట్టు లేదా బ్యాటర్ వ్యక్తిగత స్కోరు 111 వద్దకు చేరినప్పుడు ఆయన ఉన్నట్టుండి ఒంటికాలిపై నిలబడేవారంట. ఆ నంబర్ మారేంత వరకు చిన్నగా గెంతుతూ ఉండేవాడు. కేవలం 111 మాత్రమే కాకుండా, 222 (డబుల్ నెల్సన్), 333 (ట్రిపుల్ నెల్సన్) స్కోర్లు నమోదైన సందర్భాల్లోనూ ఆయన ఇలాగే చేసేవాడంట. మైదానంలో షెపర్డ్ చేసిన ఈ పనిని చూసి ప్రారంభంలో అంతా వింతగా భావించినా, కాలక్రమేణా ఇది క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయమైన సరదా సంప్రదాయంగా మారిపోయింది.
క్రికెట్ సంప్రదాయంలో 111 సంఖ్యను అత్యంత దురదృష్టకరమైనదిగా భావిస్తారు. దీనిని నెల్సన్ అని పిలుస్తారు. ఈ స్కోరు వద్ద బ్యాటర్లు ఔట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది ఒక గట్టి మూఢనమ్మకం. బ్రిటిష్ నౌకాదళ వీరుడు అడ్మిరల్ లార్డ్ నెల్సన్‌కు ఒక కన్ను, ఒక చేయి, ఒక కాలు మాత్రమే ఉండేవనే ప్రచారంతో ఈ అంకెకు ఆ పేరు వచ్చింది. రెండు పాదాలూ నేలపై బలంగా ఉంటే మైదానంలో ఏదో ఒక చెడు జరుగుతుందనే ఉద్దేశంతోనే షెపర్డ్ ఒక కాలును గాల్లోకి లేపేవారు.
షెపర్డ్ ఈ అలవాటును అంతర్జాతీయ మ్యాచ్‌ల ద్వారా మొదలుపెట్టలేదు. తన చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో, గ్లౌస్టర్‌షైర్ కౌంటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయం నుంచే ఈ పద్ధతిని పాటించారు. టీవీ కెమెరాల ద్వారా ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?
కాలక్రమంలో ఈ సరదా అలవాటు డ్రెస్సింగ్ రూమ్‌లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 111 స్కోరు రాగానే అభిమానులు కూడా ఆయనతో పాటు ఒంటికాలిపై గంతులు వేస్తూ సందడి చేయడం క్రికెట్ చరిత్రలో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..