
Usman Tariq Bowling Action: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో వారిక్‌షైర్, సోమర్‌సెట్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వారిక్‌షైర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. సామ్ హెయిన్ అర్ధసెంచరీతో మెరవగా, రాబర్ట్ యేట్స్, బ్యూ వెబ్‌స్టర్లు 40కి పైగా పరుగులతో రాణించి జట్టుకు మంచి స్కోరు అందించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్ జట్టుకు ఓపెనర్ టామ్ బాంటన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఈ ఇన్నింగ్స్ సమయంలో అందరి కళ్లూ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్, టామ్ బాంటన్ మధ్య సాగిన సమరం పైనే నిలిచాయి.
గతంలో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాంటన్, ఈసారి మాత్రం క్రీజులో పూర్తి ప్రణాళికతో కనిపించాడు. తారిఖ్ వేసిన ఒక ఓవర్లో ముందే ఊహించి (ప్రీ-మెడిటేటెడ్) అద్భుతమైన రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచిన ఆ బంతి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ చేతులను తాకుతూ సిక్సర్‌గా దూసుకెళ్లింది. ఈ కళ్ళు చెదిరే సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బాంటన్ మెరుపుల తర్వాత జేమ్స్ రూ కేవలం 48 బంతుల్లోనే 93 పరుగులు చేసి సోమర్‌సెట్ జట్టును 10 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో అద్భుత విజయతీరాలకు చేర్చాడు.
టామ్ బాంటన్, ఉస్మాన్ తారిఖ్ మధ్య ఈ శత్రుత్వానికి బలమైన కారణమే ఉంది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20 2025-26) క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్, డెజర్ట్ వైపర్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో వైపర్స్ తరపున ఆడుతున్న బాంటన్ 27 బంతుల్లో 63 పరుగులతో విధ్వంసం సృష్టిస్తున్న వేళ.. ఉస్మాన్ తారిఖ్ ఒక స్లోయర్ క్యారమ్ బాల్‌తో అతడిని అవుట్ చేశాడు. లాంగ్-ఆఫ్‌లో సామ్ కరన్ చేతికి చిక్కి అవుట్ అయిన తర్వాత బాంటన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మైదానం వీడుతున్న సమయంలో తారిఖ్ వైపు చూపిస్తూ.. అతడు బంతిని విసురుతున్నాడంటూ (త్రోయింగ్) అంపైర్లకు పదే పదే ఫిర్యాదు చేశాడు.
క్రికెట్ నిబంధనల ప్రకారం బౌలింగ్ చేసేటప్పుడు మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగకూడదు. అలా వంగితే దానిని చకింగ్ లేదా ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ అంటారు. ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ చేసేటప్పుడు కాసేపు ఆగి, వింతైన కోణంలో బంతిని వదులుతాడు. అందుకే టామ్ బాంటన్, కెమెరాన్ గ్రీన్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు అతడిపై ఫిర్యాదులు చేశారు. గతంలో ఐసీసీ అతడి యాక్షన్‌ను పరిశీలించి, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు నిబంధనల ప్రకారమే ఆడుతున్నప్పటికీ, క్రికెట్ ప్రపంచంలో ఒకసారి అంటిన ‘చకింగ్’ ముద్ర అంత సులువుగా చెరిగిపోదు. తారిఖ్ తన విలక్షణమైన శైలిని మార్చుకోనంత కాలం అభిమానులు, ఆటగాళ్లు అతడిని అనుమానంగా చూడటం ఆపలేరనడానికి ఈ తాజా సంఘటనే నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..