రోహిత్ కెప్టెన్సీలో మెరిసిన తెలుగబ్బాయ్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా అడుగులు..!
Tilak Varma Leadership: తిలక్ వర్మకు రోహిత్ శర్మ కేవలం సీనియర్ ఆటగాడు కాదు.. మైదానంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, బయట జట్టును ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు నేర్పిన లీడర్ షిప్ మెంటార్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ అనుభవాన్ని వైస్ కెప్టెన్‌గా తిలక్ ఎలా ఉపయోగిస్తాడనేది భారత టీ20 క్రికెట్‌లో చూడాల్సిన ఆసక్తికర అంశం.

మైదానంలో కెప్టెన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఓ ఆలోచన ఉంటుంది. ఆ విషయాన్ని చాలా దగ్గరగా గమనించిన భారత T20I వైస్ కెప్టెన్ తిలక్ వర్మ.. తన లీడర్ షిప్ లక్షణాలపై రోహిత్ శర్మ చూపించిన ప్రభావం గురించి వెల్లడించాడు. మైదానంలో బౌలర్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది? యువ ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలి? మ్యాచ్ పరిస్థితులను ఎలా చదవాలి? ఈ అంశాలపై రోహిత్‌ను గమనిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తిలక్ చెప్పాడు.
రోహిత్‌ను బయట కూర్చుని గమనించేవాడిని!
తిలక్ వర్మ (Tilak Varma)కు భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున కూడా రోహిత్ నాయకత్వంలో ఆడాడు. తాను విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీలో ఆడలేదని చెప్పిన తిలక్.. రోహిత్ నాయకత్వంలో మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నానని వివరించాడు.
మైదానంలో ఉన్నప్పుడు ఆటపై ఒత్తిడి, వేగంగా మారే పరిస్థితుల కారణంగా ప్రతి విషయాన్ని గమనించడం కష్టమవుతుందని తిలక్ చెప్పాడు. అందుకే మైదానం బయట రోహిత్‌తో మాట్లాడి వివిధ అంశాలను తెలుసుకునేవాడినని వివరించాడు.
అంతేకాదు.. ఒకప్పుడు రోహిత్, కోహ్లీ ఆడుతున్నప్పుడు తాను ప్లేయింగ్ 11లో లేకపోయినా, బయట కూర్చుని రోహిత్ నిర్ణయాలను పరిశీలించేవాడట.
ఏ బౌలర్‌ను ఎప్పుడు బరిలోకి దించుతున్నాడు? పరిస్థితికి తగ్గట్టు బౌలర్లను ఎలా ఉపయోగిస్తున్నాడు? అనే అంశాలను జాగ్రత్తగా గమనించానని తిలక్ తెలిపాడు. ఇప్పుడు తాను మైదానంలో ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని తన ఆటలో ఉపయోగిస్తున్నానని చెప్పాడు.
వైస్ కెప్టెన్ అంటే అదనపు బాధ్యత..
ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నేతృత్వంలోని భారత T20I జట్టుకు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ బాధ్యత కేవలం మైదానంలో కెప్టెన్‌కు సహాయం చేయడం వరకే పరిమితం కాదని తిలక్ స్పష్టం చేశాడు. వైస్ కెప్టెన్‌గా నియమించాక జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా మనల్ని కొంత సీనియర్‌గా చూస్తారని పేర్కొన్నాడు.
మైదానంలో కెప్టెన్ నిర్ణయాలు తీసుకుంటాడని, అయితే అవసరమైనప్పుడు తన అభిప్రాయాలను శ్రేయస్‌తో పంచుకుంటానని తిలక్ చెప్పాడు.
ఇక అసలు బాధ్యత మైదానం బయట ఉంటుందని అతడి మాటల్లో స్పష్టమైంది. జట్టు వాతావరణం, యువ ఆటగాళ్లతో సంభాషణ, ప్రతి ప్లేయర్ మానసిక పరిస్థితి, వారి ఫామ్‌లో వచ్చే హెచ్చుతగ్గులు.. వీటిని గమనించడం కూడా లీడర్ షిప్‌లో భాగమేనని తిలక్ వివరించాడు.
టాప్ ఆర్డర్ నుంచి ఫినిషర్‌గా మారడం అంత ఈజీ కాదు!
తిలక్ తన బ్యాటింగ్ రోల్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చిన్నప్పటి నుంచే టాప్ ఆర్డర్‌లో ఆడటం తనకు ఇష్టమని, ముఖ్యంగా 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా ఆడిన తిలక్.. తర్వాత IPLలో 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. అయితే 3 లేదా 4 నుంచి 6, 7కు మారడం చాలా కష్టమైన మార్పు అని తిలక్ తెలిపాడు.
లోయర్ ఆర్డర్‌లో బంతి పాతదవుతుంది. బౌలర్లు స్లో బాల్స్, యార్కర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో బ్యాటింగ్ పద్ధతి కూడా మారుతుంది. ఈ పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకునేందుకు ప్రాక్టీస్‌తో పాటు మెంటల్ ప్రిపరేషన్ కూడా ప్రత్యేకంగా పనిచేశానని తిలక్ వివరించాడు.
మ్యాచ్‌కు ముందు తిలక్ చేసే పని ఇదే..!
తన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా తిలక్ కీలక విషయం చెప్పాడు. మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి బౌలర్ల గురించి ఆలోచిస్తానని తెలిపాడు. ముఖ్యంగా ప్రత్యర్థి బెస్ట్ బౌలర్ ఎవరు? అతడిని ఎలా అటాక్ చేయాలి? ఏ పరిస్థితిలో తాను క్రీజులోకి వస్తాడు? అనే విషయాలను ముందుగానే ప్రాక్టీస్ చేస్తానని చెప్పాడు.
మ్యాచ్‌లోకి వెళ్లే ముందు కష్టమైన పరిస్థితులను ఊహించుకుని సిద్ధమైతే.. అసలు మ్యాచ్‌లో పరిస్థితులు సులభంగా అనిపిస్తాయని తిలక్ అభిప్రాయపడ్డాడు.
తిలక్‌లో కనిపిస్తున్న కొత్త నాయకత్వ కోణం..
తిలక్ వర్మ ప్రయాణం కేవలం ఒక లెఫ్ట్ హ్యాండర్‌గా ఎదగడమే కాదు. టాప్ ఆర్డర్‌లో తనకు ఇష్టమైన స్థానాన్ని వదిలి జట్టు అవసరానికి తగ్గట్టు ఫినిషర్ రోల్‌ను స్వీకరించడం, రోహిత్ శర్మలాంటి సీనియర్ కెప్టెన్ నిర్ణయాలను గమనించడం, ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా జట్టు ఆటగాళ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం.. అతడి క్రికెట్ మెచ్యూరిటీని చూపిస్తోంది.
లక్నోలో వెస్టిండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి T20I సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తదుపరి మ్యాచ్ రాంచీలో జరగనుంది. ఈ నేపథ్యంలో తిలక్ బాధ్యత మరింత ఆసక్తికరంగా మారింది.
