Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?

Ishan Kishan Century: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సౌత్ జోన్‌పై సెంచరీతో సత్తా చాటాడు. 122 బంతుల్లో సెంచరీ చేసిన అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 10వ సెంచరీతోపాటు 4,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమక్షంలో వచ్చిన ఈ ఇన్నింగ్స్‌తో టెస్టు జట్టులోకి తిరిగి రావాలన్న తన ప్రయత్నానికి బలం చేకూర్చాడు.

Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?
Duleep Trophy Ishan Kishan Century

Updated on: Sep 06, 2026 | 6:23 PM

Ishan Kishan Century: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను టీమిండియాలో తన రీఎంట్రీకి వేదికగా మార్చుకున్నాడు ఇషాన్ కిషన్. సౌత్ జోన్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు 133 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన ఛోటా ప్యాకెట్.. ఒత్తిడిని అధిగమిస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు.

కీలక సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్..

క్రీజులో కుదురుకున్న తర్వాత ఇషాన్ తన సహజ దూకుడును నియంత్రించుకుంటూనే పరుగుల వర్షం కురిపించాడు. 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్.. ఇందులో 13 ఫోర్లు, ఒక సిక్స్ బాదేశాడు. బౌండరీతో సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో కెప్టెన్ నుంచి వచ్చిన ఈ ఇన్నింగ్స్ ఈస్ట్ జోన్‌ భారీ స్కోర్ సాధించేందుకు దోహదపడింది.

4 వేల పరుగుల మైలురాయి..

ఈ సెంచరీతో ఇషాన్ మరో వ్యక్తిగత ఘనతను కూడా అందుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇది అతడికి 10వ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు 4,000 పరుగుల మైలురాయికి 48 పరుగుల దూరంలో ఉన్న అతడు.. సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆ మార్కును దాటేశాడు.

అగార్కర్ ముందే అదరగొట్టి..

ఈ ప్రదర్శనకు మరో ప్రత్యేకత ఉంది. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెపాక్‌లో ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. జాతీయ జట్టులో తిరిగి చోటు కోసం ప్రయత్నిస్తున్న ఇషాన్‌కు అలాంటి సందర్భంలో వచ్చిన సెంచరీ ప్రాధాన్యం సంతరించుకుంది.

టెస్టుల్లో చివరిసారి 2023లో..

ఇషాన్ భారత్ తరపున చివరిసారిగా 2023లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. అదే అతడి అరంగేట్ర సిరీస్. రెండు టెస్టుల్లో 78 పరుగులు చేసిన అతడి ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆ తర్వాత టెస్టు జట్టులో అవకాశం దక్కలేదు.

ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో పరుగులతోనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఉన్న ఇషాన్‌కు దులీప్ ట్రోఫీ ఫైనల్ శతకం కీలకంగా మారింది. ఈ ప్రదర్శన వెంటనే భారత టెస్టు జట్టులో చోటు ఖాయం చేస్తుందా అన్నది చెప్పలేకపోయినా.. అవకాశాల కోసం తాను సిద్ధంగా ఉన్నాననే సందేశాన్ని మాత్రం ఇషాన్ బలంగా ఇచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us