T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా వరుస విజయాలు, సొంత గడ్డ పై కప్పు వంటి 5 ప్రధాన రికార్డులను భారత్ తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా
Ind Vs Nz

Updated on: Mar 07, 2026 | 2:52 PM

T20 World Cup Final : ఆకాశమే హద్దుగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ పోరు కేవలం ఒక ఆట మాత్రమే కాదు, టీమిండియా పాలిట ఇదొక అగ్నిపరీక్ష. ఏళ్ల తరబడి భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ఐదు అపనమ్మకాలను పటాపంచలు చేసేందుకు సూర్యకుమార్ సేన సిద్ధమైంది. అవేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.

డిఫెండింగ్ ఛాంపియన్ శాపం తిరగరాసే వేళ

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు టైటిల్ గెలవలేదు. కనీసం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉండి మరుసటి ఏడాది ఫైనల్‌కు చేరిన దాఖలాలు కూడా తక్కువే. కానీ భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరి ఆ రికార్డును తిరగరాసింది. ఇప్పుడు కివీస్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడితే, చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా ఈ పాత సెంటిమెంట్‌ను చెరిపివేస్తుంది.

సొంత గడ్డపై కప్పు కొట్టలేమనే భయం

మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తున్న ఏ దేశం కూడా ఇంతవరకు తమ సొంత గడ్డపై ఛాంపియన్‌గా అవతరించలేదు. ఈసారి భారత్ ఆతిథ్య దేశంగా ఉండి ఫైనల్ ఆడుతోంది. కివీస్‌ను మట్టికరిపిస్తే, సొంత ప్రేక్షకుల మధ్య కప్పు అందుకున్న తొలి దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.

అహ్మదాబాద్ ఫైనల్ చేదు జ్ఞాపకం

అహ్మదాబాద్ స్టేడియం అంటేనే భారత అభిమానులకు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి గుర్తొస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం ఒక గాయంలా మిగిలిపోయింది. అదే మైదానంలో ఇప్పుడు మరో ఐసీసీ ఫైనల్ జరుగుతోంది. ఈసారి కివీస్‌ను ఓడించి, అహ్మదాబాద్ స్టేడియం మనకు కలిసిరాదు అనే భ్రమను టీమిండియా తొలగించాల్సి ఉంది.

కివీస్ గండం.. టీ20 వరల్డ్ కప్ చరిత్ర

అత్యంత భయంకరమైన గణాంకం ఏమిటంటే, టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. మూడుసార్లు తలపడితే మూడుసార్లూ కివీస్‌దే పైచేయి అయింది. ఫైనల్ లాంటి కీలక పోరులో ఈ నెగిటివ్ రికార్డును చెరిపేసి, తాము కివీస్‌ను కూడా ఓడించగలమని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

మాయాజాలం పనిచేయకూడదు

న్యూజిలాండ్‌కు ఐసీసీ టోర్నీలలో ఒక అలవాటు ఉంది. వాళ్లు ఇప్పటివరకు గెలిచిన ఐసీసీ టైటిల్స్ అన్నీ భారత్‌ను ఓడించి గెలిచినవే. అది టెస్ట్ ఛాంపియన్ షిప్ అయినా, గతంలో జరిగిన వన్డే టోర్నీలైనా.. ఇండియాపై గెలిస్తేనే వాళ్లు ఛాంపియన్ అవుతారు అనే ఒక నానుడి ఉంది. ఈసారి ఆ మాయాజాలం సాగకుండా కివీస్ దూకుడుకు కట్టడి చేయడమే టీమిండియా అసలైన లక్ష్యం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us