
Steve Smith: కరాచీలోని నేషనల్ స్టేడియంలో రావల్పిండి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో యువ ఫాస్ట్ బౌలర్ రజావుల్లాను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన స్మిత్, ఆ తర్వాత వరుసగా మూడు భారీ సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం నాలుగు బంతుల్లోనే 22 పరుగులు రాబట్టి రావల్పిండి బౌలింగ్ విభాగం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఈ ఓవర్‌లో మొత్తం 23 పరుగులు రావడం విశేషం.
సాధారణంగా క్లాసిక్ షాట్లకు పేరుగాంచిన స్మిత్, ఈ మ్యాచ్‌లో మాత్రం వినూత్న శైలిలో కనిపించాడు. వికెట్ కీపర్ తల మీదుగా అతను ఆడిన ‘ర్యాంప్ షాట్’ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వీరబాదుడును గుర్తుకు తెచ్చింది. స్మిత్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. 18 బంతుల్లో 21 పరుగులతో నెమ్మదిగా మొదలైన అతని ఇన్నింగ్స్, ఒక్కసారిగా వేగం పుంజుకుని 22 బంతుల్లోనే 43 పరుగులకు చేరుకుంది.
Steve Smith is probably the only Australian along with Siddle who are performing well in the PSL. Rest are strugglingpic.twitter.com/OwWnWx9C8K
— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) April 21, 2026
స్టీవ్ స్మిత్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో అర్ధసెంచరీ. అంతకుముందు లాహోర్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌పై 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన తొలి సీజన్ ఆడుతున్న ఈ 36 ఏళ్ల వెటరన్ ఆటగాడు ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌ల్లో 148.07 స్ట్రైక్ రేట్‌తో 231 పరుగులు సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్‌లో చూపిన ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తూ ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రధాన బలంగా మారాడు.
మొదట బ్యాటింగ్ చేసిన రావల్పిండి జట్టు డారిల్ మిచెల్ (58), డియాన్ ఫారెస్టర్ (37) మెరుపులతో 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో స్మిత్ మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, చివర్లో కెప్టెన్ ఆష్టన్ టర్నర్ దూకుడుగా ఆడి జట్టును విజ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ముల్తాన్ సుల్తాన్స్ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అగ్రస్థానంలో అజేయంగా ఉన్న పెషావర్ జల్మీ తర్వాతి స్థానంలో ముల్తాన్ నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..