
Shubman Gill Lucky Kurta Story: ఈ రోజు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న భారత జట్టు స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ప్రయాణం వెనుక ఉన్న అసలైన హీరోని పరిచయం చేశారు. తండ్రి లఖ్వీందర్ సింగ్ కన్న కలలే తనను ఈ స్థాయికి చేర్చాయని ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ప్రతి మ్యాచ్ సందర్భంగా తన తండ్రి పాటించే ఒక విచిత్రమైన నమ్మకం, వారి ఊరిలో నడుపుతున్న ఉచిత అకాడమీ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పంజాబ్ లోని ఒక సాధారణ రైతు కుటుంబం మాది. సొంతంగా క్రికెటర్ కావాలనుకున్న లఖ్వీందర్ సింగ్ ఆ కల నెరవేరకపోవడంతో కొడుకుని గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. చేనులోనే పిచ్ తయారుచేసి రోజూ 500 కి పైగా బంతులు విసురుతూ తీవ్ర శిక్షణ ఇచ్చేవారు. కొడుకును ఔట్ చేసిన బౌలర్లకు నగదు బహుమతులు ఇచ్చి వినూత్నంగా ప్రోత్సహించేవారు. కొడుకు భవిష్యత్తు కోసం ఫాజిల్కా గ్రామం ఖాళీ చేసి ఏకంగా మొహాలీకి మకాం మార్చారు. తండ్రి పడ్డ శ్రమే ఈ రోజు గిల్ ని టీమిండియా నాయకుడిగా నిలబెట్టింది.
మొహాలీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గిల్ తన తండ్రికి ఉన్న సెంటిమెంట్ గురించి చెబుతూ నవ్వులు పూయించారు. మ్యాచ్ జరుగుతున్న రోజుల్లో తన తండ్రి కచ్చితంగా సాంప్రదాయ కుర్తా-పైజామా మాత్రమే ధరిస్తారట. ఆ బట్టలు వేసుకున్నప్పుడే కొడుకు భారీ సెంచరీలు కొడతాడని, లేదా భారత్ విజయం సాధిస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారు. ఎక్కడికి వెళ్లినా మ్యాచ్ రోజు ఆ డ్రెస్ లోనే కనిపిస్తారని గిల్ ఎంతో మురిపెంగా చెప్పుకొచ్చారు.
కేవలం తన కొడుకుతోనే ఆయన ఆగిపోలేదు. సొంత గ్రామంలో గ్రామీణ పిల్లల కోసం ఒక ఉచిత క్రికెట్ అకాడమీని నడుపుతున్నారు. తీరిక సమయం దొరికితే చాలు అక్కడ వాలిపోయి గంటల తరబడి చిన్న పిల్లల ఆటను గమనిస్తుంటారు. ఆరేళ్ల పసివాడు అద్భుతంగా ఫీల్డింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా వెంటనే గిల్ కి ఫోన్ చేసి ఆ కుర్రాడి ప్రతిభ గురించి ఎంతో ఉత్సాహంగా వివరిస్తారు. ఈ ఆటపై ఉన్న ఆరని ప్రాణమే తనను ఈ స్థితికి తెచ్చిందని గిల్ కొనియాడారు.
VIDEO | Mohali, Punjab: At the launch of the Sher-e-Punjab T20 League, India captain Shubman Gill, says, “I think my father always had a dream of seeing me play cricket. We also run a free cricket academy in our village so that children from the nearby areas can come and play… pic.twitter.com/foU7s3pORi
— Press Trust of India (@PTI_News) August 2, 2026
ఎంతోమంది పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వారి కలలకు రెక్కలు తొడుగుతున్నారు లఖ్వీందర్. చిన్నతనం లోనే పిల్లల్లో ఉండే ప్రతిభను గుర్తించడం ఆయనకు ఉన్న గొప్ప కళ అని గిల్ ప్రశంసించారు. తన తండ్రి ఆశయాలు, నమ్మకాలే తనను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..