
Shaheen Afridi fight Umar Gul: సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ మ్యాచ్ తుది జట్టు నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని తప్పించారు. అతని స్థానంలో ఖుర్రమ్ షెహజాద్‌ను జట్టులోకి తీసుకోగా, బాబర్ ఆజం, సాజిద్ ఖాన్ కూడా తుది జట్టులోకి తిరిగొచ్చారు. తనను జట్టు నుంచి తొలగించడంపై షాహీన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మ్యాచ్ సాగుతున్న సమయంలో డగౌట్‌లో కూర్చున్న షాహీన్ అఫ్రిది, పాక్ బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో వాగ్వాదానికి దిగాడు. ఉమర్ గుల్ అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, షాహీన్ ఏమాత్రం వినకుండా తన తలపై చేతులతో సైగలు చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కోచ్‌ను కాదని డగౌట్‌లోని మరో వ్యక్తి వైపు చూస్తూ అసహనంతో ఏదో గట్టిగా మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండగా, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఇలా బహిరంగంగా గొడవ పడటం పాక్ క్రికెట్ పరువును తీసివేసిందని అభిమానులు మండిపడుతున్నారు.
What just happened here???#PAKvsBAN pic.twitter.com/YzRUXsnxAS
— DR EB (@Silly_MID__ON) May 17, 2026
నిజానికి షాహీన్ అఫ్రిది ఆగ్రహానికి కేవలం ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కావడం మాత్రమే కారణం కాదు. ఢాకాలో జరిగిన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ 104 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోనే కెప్టెన్ షాన్ మసూద్, షాహీన్ అఫ్రిదిల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు సమాచారం.
ఆ మ్యాచ్‌లో షాహీన్ సగటు వేగం కేవలం 132 కిలోమీటర్లుగా నమోదైంది. బంగ్లాదేశ్ బౌలర్ నహీద్ రాణా 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. “మన పేసర్లలో వేగం లేకపోవడం వల్లే ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాలేకపోయాం” అని కెప్టెన్ మసూద్ బౌలర్లను నిందించాడు. దీనికి షాహీన్ కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ.. “ముందు బ్యాటర్ల వైఫల్యం వల్ల మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం రాలేదనే విషయాన్ని గమనించాలని, కెప్టెన్‌గా మొదట నీ బ్యాటింగ్ ప్రదర్శనను సరిచూసుకోవాలని” ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ మనసులో ఉంచుకునే కెప్టెన్ అతనికి రెండో టెస్టులో చోటు ఇవ్వలేదని సమాచారం.
ఈ వివాదాల నడుమ జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న దశలో లిట్టన్ దాస్ అద్భుతమైన శతకంతో (126 పరుగులు, 16 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. పాక్ బౌలర్లలో షాహీన్ స్థానంలో వచ్చిన ఖుర్రమ్ షెహజాద్ 4 వికెట్లు, మహ్మద్ అబ్బాస్ 3 వికెట్లు పడగొట్టారు.
ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు కూడా తీవ్రంగా తడబడుతోంది. బాబర్ ఆజం 68 పరుగులతో రాణించినప్పటికీ, మిగిలిన మిడిలార్డర్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (13), సల్మాన్ ఆగా (21) నిరాశపరిచారు. కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్ల మైలురాయిని అందుకుని, ఈ ఘనత సాధించిన 9వ పాకిస్థాన్ బౌలర్‌గా నిలిచిన షాహీన్ అఫ్రిది.. ఇప్పుడు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవడం గమనార్హం.
పాకిస్థాన్ క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించిందనడానికి ఈ లైవ్ టీవీ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. మైదానంలో ఆటపై దృష్టి పెట్టకుండా, కోచ్‌లతోనూ, కెప్టెన్లతోనూ అంతర్గత పోరుకు దిగడం వల్ల ఆ జట్టు ప్రదర్శన నానాటికీ దిగజారుతోంది. ఈ వివాదంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..