SA vs NZ : ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్ సమరం.. 19 ఏళ్ల పగను కివీస్ తీర్చుకుంటుందా?

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.

SA vs NZ : ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్ సమరం.. 19 ఏళ్ల పగను కివీస్ తీర్చుకుంటుందా?
Sa Vs Nz

Updated on: Mar 04, 2026 | 7:29 AM

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతున్న సౌతాఫ్రికా ఒకవైపు ఉంటే.. ఎలాగైనా చరిత్రను తిరగరాయాలని కసితో ఉన్న కివీస్ జట్టు మరోవైపు ఉంది. అయితే, గణాంకాలు సఫారీలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఈసారి కివీస్ కొత్త చరిత్ర సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

న్యూజిలాండ్ జట్టుకు ఈ మ్యాచ్ కేవలం ఒక సెమీఫైనల్ మాత్రమే కాదు.. అదొక పంతం. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ చరిత్రలో సౌతాఫ్రికాను ఓడించడం కివీస్‌కు ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. 2007లో జరిగిన మొదటి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ నుంచి నేటి వరకు ఈ రెండు జట్లు మెగా టోర్నీలో 5 సార్లు తలపడగా.. ఐదుసార్లూ సౌతాఫ్రికానే విజయం సాధించింది. అంటే గత 19 ఏళ్లుగా ప్రపంచకప్ వేదికపై సఫారీల చేతిలో కివీస్ చావుదెబ్బ తింటూనే ఉంది. ఇప్పుడు మిచెల్ శాంట్నర్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టుకు ఈ 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సువర్ణ అవకాశం లభించింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, శాంట్నర్ తన మాయాజాలంతో సఫారీలను దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తం అంతర్జాతీయ టీ20 రికార్డులను పరిశీలిస్తే, సౌతాఫ్రికా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 19 సార్లు ముఖాముఖి తలపడగా.. సౌతాఫ్రికా 12 సార్లు, న్యూజిలాండ్ 7 సార్లు విజయం సాధించాయి. పైగా ఇదే 2026 ప్రపంచకప్ గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ఈ పాత రికార్డులన్నీ సఫారీలకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంటే, కివీస్‌కు మాత్రం ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. అయితే, నాకౌట్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టుగా మారుతుందని మర్చిపోకూడదు.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికాకు ఉన్న చోకర్స్ ముద్రను తొలగించుకుని మొదటిసారి టీ20 ప్రపంచకప్ గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ తన పాత ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటూ కొత్త చరిత్రను లిఖించాలని చూస్తోంది. కోల్‌కతా క్రికెట్ అభిమానులు ఈ పోరు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న ఈ రెండు జట్లలో ఎవరు ఫైనల్ టికెట్ సాధిస్తారో చూడాలి. 19 ఏళ్ల పగను కివీస్ తీర్చుకుంటుందా? లేక సఫారీలు తమ విజయయాత్రను కొనసాగిస్తారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us