ఐర్లాండ్ హెడ్ కోచ్ రాజీనామా.. టీమిండియాపై చారిత్రాత్మక విజయం తర్వాత సంచలన నిర్ణయం!

భారత్‌పై చారిత్రక టీ20 సిరీస్ విజయం సాధించిన వెంటనే ఐర్లాండ్ ప్రధాన కోచ్ హెన్రిచ్ మలాన్ రాజీనామా చేశారు. నాలుగేళ్లకు పైగా జట్టుకు సేవలందించిన మలాన్, కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పర్యవేక్షణలో ఐర్లాండ్ ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే వంటి జట్లపై కీలక విజయాలు నమోదు చేసి, మూడు టీ20 ప్రపంచకప్‌లకు అర్హత సాధించింది.

ఐర్లాండ్ హెడ్ కోచ్ రాజీనామా.. టీమిండియాపై చారిత్రాత్మక విజయం తర్వాత సంచలన నిర్ణయం!
Heinrich Malan Resignation

Updated on: Jun 30, 2026 | 4:28 PM

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుపై చారిత్రాత్మక టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఐర్లాండ్ హెడ్ కోచ్ హెన్రిచ్ మలాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లకు పైగా జట్టుకు సేవలందించిన ఆయన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి అధికారికంగా తెలియజేశారు. భారత్‌పై 2-0తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో మలాన్ తన బాధ్యతల నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయన ఒప్పందం 2027 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, తన కోచింగ్ ప్రయాణంలో కొత్త సవాళ్లను స్వీకరించాల్సిన సమయం వచ్చిందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాజీనామా సందర్భంగా హెన్రిచ్ మలాన్ భావోద్వేగంగా స్పందించారు. ఐర్లాండ్ క్రికెట్ కుటుంబంతో కలిసి పనిచేయడం తనకు గౌరవంగా భావిస్తున్నానని, తన కుటుంబంతో కలిసి ఐర్లాండ్‌లో గడిపిన సమయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది అందరూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని విశ్వసించి సహకరించారని, అది తన కోచింగ్ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రయాణంగా నిలిచిందని పేర్కొన్నారు. మలాన్ హయాంలో ఐర్లాండ్ జట్టు పలు చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై చిరస్మరణీయ విజయం, అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌పై తొలి టెస్ట్ గెలుపు, బెల్‌ఫాస్ట్‌లో జింబాబ్వేపై స్వదేశంలో తొలి టెస్ట్ విజయం, తాజాగా భారత్‌పై తొలి టీ20 సిరీస్ విజయం ఆయన నాయకత్వంలోనే సాధ్యమయ్యాయి. అంతేకాకుండా పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లపై విజయాలు సాధించి, వరుసగా మూడు టీ20 ప్రపంచకప్‌లకు అర్హత సాధించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.

క్రికెట్ ఐర్లాండ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ కూడా మలాన్ సేవలను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి జట్టును కొత్త స్థాయికి తీసుకెళ్లారని, ఆటగాళ్లలో నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ఐర్లాండ్ పురుషుల జట్టు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేశారని కొనియాడారు. ఇక ఐర్లాండ్ క్రికెట్ బోర్డు గ్యారీ విల్సన్‌ను ఐర్లాండ్ కొత్త ప్రధాన కోచ్‌గా నియమించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us