RCB vs GT: ఆర్‌సీబీ అభిమానులకు షాక్.. తోపు ప్లేయర్‌ను పక్కన పెట్టేసిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?

IPL 2026 RCB vs GT Qualifier 1 Phil Salt injury update: ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర ఓపెనర్ అందుబాటులో లేకపోవడం ఆర్‌సీబీకి ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ప్లేఆఫ్స్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో వ్యూహాత్మక నిర్ణయాలు ఎంతటి ఫలితాన్నైనా మారుస్తాయి.

RCB vs GT: ఆర్‌సీబీ అభిమానులకు షాక్.. తోపు ప్లేయర్‌ను పక్కన పెట్టేసిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
Rcb Vs Gt

Updated on: May 26, 2026 | 7:39 PM

IPL 2026 RCB vs GT Qualifier 1 Phil Salt injury update: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలక ఘట్టానికి చేరుకుంది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరుగుతున్న క్వాలిఫయర్-1 పోరులో టాస్ అప్‌డేట్ వచ్చేసింది. అయితే, ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తుది జట్టులో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

సాల్ట్ ఎందుకు ఆడటం లేదు? అసలు ఏం జరిగింది?

లీగ్ దశలో ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ డైనమైట్ ఫిల్ సాల్ట్, ఈ మెగా మ్యాచ్‌కు దూరం కావడం వెనుక బలమైన కారణమే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సాల్ట్ కుడిచేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు టోర్నీ మధ్యలోనే చికిత్స కోసం స్వదేశానికి వెళ్ళవలసి వచ్చింది. లండన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో కోలుకున్న ఈ స్టార్ బ్యాటర్, గత వారమే తిరిగి భారత్‌కు చేరుకుని ఆర్‌సీబీ క్యాంపులో జాయిన్ అయ్యాడు.

సాల్ట్ రాకతో అతడు క్వాలిఫయర్-1 ఆడటం ఖాయమని అందరూ భావించారు. కానీ, మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో కెప్టెన్ రజత్ పాటిదార్ అసలు విషయం వెల్లడించాడు. “సాల్ట్ ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నాడు. నెట్స్‌లో కొద్దిగా ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ వైద్య బృందం ఇంకా అతడిని నిశితంగా గమనిస్తోంది. పిచ్ పరిస్థితులు, భవిష్యత్తు మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని పాటిదార్ స్పష్టం చేశాడు. వేలి గాయం పూర్తిగా మానకపోవడంతో, ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే వ్యూహాత్మక నిర్ణయంతోనే అతడిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ఫైనల్ బెర్తు కోసం హోరాహోరి పోరు..

ధర్మశాల మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్‌కు దూసుకెళ్తుంది. రజత్ పాటిదార్ పగ్గాలు చేపట్టిన తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరి ట్రోఫీని నిలబెట్టుకోవాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. మరోవైపు, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ లీగ్ స్టేజ్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని, ఐదేళ్లలో మూడోసారి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగింది.

భారీ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ..

ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు ఆర్‌సీబీ రన్ మెషీన్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో 43 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిని అందుకోనున్నాడు. సాల్ట్ లేని లోటును కోహ్లీ తన విశ్వరూపంతో భర్తీ చేస్తాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర ఓపెనర్ అందుబాటులో లేకపోవడం ఆర్‌సీబీకి ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ప్లేఆఫ్స్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో వ్యూహాత్మక నిర్ణయాలు ఎంతటి ఫలితాన్నైనా మారుస్తాయి. సాల్ట్ స్థానంలో వచ్చిన ఆటగాడు ఏ మేరకు రాణిస్తాడు, కోహ్లీ ఒంటరి పోరాటంతో జట్టును ఫైనల్‌కు చేరుస్తాడా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us