IND vs USA : కష్టాల్లోనూ కసిగా పోరాడారు.. వాంఖడేలో బోణీ కొట్టిన టీమిండియా

IND vs USA T20 World Cup 2026 :ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. పసికూన అమెరికాపై తడబడినా, చివరికి టీమిండియా తన అనుభవంతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత బ్యాటింగ్, బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీలో శుభారంభం చేసింది.

IND vs USA :  కష్టాల్లోనూ కసిగా పోరాడారు.. వాంఖడేలో బోణీ కొట్టిన టీమిండియా
Ind Vs Usa

Updated on: Feb 07, 2026 | 10:46 PM

IND vs USA T20 World Cup 2026 : ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. టాప్ ఆర్డర్ తడబడినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరానికి చేర్చాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్విక్ 4 వికెట్లతో భారత టాప్ ఆర్డర్‌ను వణికించాడు. పవర్‌ప్లేలోనే భారత్ 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25), శివం దూబే (0) వెనువెంటనే అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అనుభవాన్నంతా ఉపయోగించి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు భారత బౌలర్ల ధాటికి తలవంచింది. మహమ్మద్ సిరాజ్ రెండో ఓవర్లోనే గౌస్‌ను అవుట్ చేసి అమెరికాకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్‌ను డకౌట్ చేయడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. అమెరికా బ్యాటర్లలో మిలింద్ (34), సంజయ్ (37) కాసేపు పోరాడినా, భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు. చివరికి అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. భారత్ తరపున సిరాజ్ 2, అర్ష్‌దీప్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

వైరల్ ఫీవర్ కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమవ్వడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అతని స్థానంలో వచ్చిన మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి రెండు వికెట్లు తీశాడు. ఇక అమెరికా జట్టులో అలీ ఖాన్, శుభమ్ రంజనే గాయపడటం ఆ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ టేబుల్‌లో టాప్ స్థానానికి చేరుకుని తన తదుపరి మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.