
DLS Method: క్రికెట్‌లో వర్షం పడితే మ్యాచ్ ఫలితం ఎలా నిర్ణయిస్తారనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా లక్ష్య ఛేదన సమయంలో వర్షం అంతరాయం కలిగిస్తే డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (Duckworth-Lewis-Stern) లేదా DLS పద్ధతిని ఉపయోగిస్తారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇదే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 26 ఓవర్లకు 113/7 స్కోరుతో ఉన్న సమయంలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో DLS పద్ధతి ద్వారా భారత్‌ను విజేతగా ప్రకటించారు.
వర్షం కారణంగా మ్యాచ్‌లో ఓవర్లు తగ్గినప్పుడు లేదా ఆట పూర్తిగా నిలిచిపోయినప్పుడు ఫలితాన్ని నిర్ణయించడానికి DLS పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
1. బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఇంకా ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయి?
2. ఆ జట్టు వద్ద ఇంకా ఎన్ని వికెట్లు అందుబాటులో ఉన్నాయి?
ఈ రెండింటి ఆధారంగా జట్టుకు ఉన్న రన్ సాధించే వనరులను (Resources) లెక్కిస్తారు. ఎక్కువ ఓవర్లు, ఎక్కువ వికెట్లు అందుబాటులో ఉంటే పరుగులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఓవర్లు తగ్గిపోయినా, వికెట్లు ఎక్కువగా కోల్పోయినా రన్ సాధించే వనరులు తగ్గుతాయి.
ఉదాహరణకు రెండు జట్లకు 20 ఓవర్లు మిగిలి ఉన్నాయని అనుకుందాం. ఒక జట్టు చేతిలో 10 వికెట్లు ఉంటే, మరో జట్టు ఏడు వికెట్లు కోల్పోయి మూడు వికెట్లతో ఆడుతుంటే.. ఈ రెండు జట్ల రన్ సాధించే అవకాశాలు ఒకేలా ఉండవు.
అందుకే DLS పద్ధతిలో కేవలం మిగిలిన ఓవర్లను మాత్రమే లెక్కించరు. వికెట్ల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి బంతి, ప్రతి వికెట్ పడినప్పుడు అందుబాటులో ఉన్న వనరుల శాతం మారుతుంది. ఈ లెక్కల ఆధారంగా లక్ష్యాన్ని సవరించి పార స్కోరును నిర్ణయిస్తారు.
వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఇరు జట్లకు 47 ఓవర్ల చొప్పున కేటాయించారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 134 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్లు కోల్పోతూ ఇబ్బంది పడింది.
26 ఓవర్లకు భారత స్కోరు 113/7గా ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆట తిరిగి ప్రారంభం కాకపోవడంతో DLS పద్ధతిలో భారత జట్టు పార స్కోరును 109 పరుగులుగా నిర్ణయించారు.
అంటే ఆ సమయానికి భారత్ విజయానికి అవసరమైన పార స్కోరు 109 పరుగులు కాగా, అప్పటికే 113 పరుగులు చేసింది. దీంతో పార స్కోరును నాలుగు పరుగులు అధిగమించడంతో భారత్ విజయం సాధించింది.
ఇక్కడే చాలామందికి సందేహం వస్తుంది. భారత జట్టు ఇంకా మూడు వికెట్లు మాత్రమే చేతిలో ఉంచుకుని ఉంది. మరోవైపు లక్ష్యాన్ని పూర్తిగా ఛేదించడానికి ఇంకా 22 పరుగులు చేయాల్సి ఉంది. అయినప్పటికీ విజయం ఎలా వచ్చిందంటే.. DLS పద్ధతిలో మ్యాచ్ ఆగిపోయిన సమయానికి ఉన్న స్కోరును, అందుబాటులో ఉన్న ఓవర్లు, వికెట్ల ఆధారంగా లెక్కించిన పార స్కోరుతో పోలుస్తారు.
భారత్ 113 పరుగులు చేయగా పార స్కోరు 109 మాత్రమే కావడంతో విజయం దక్కింది. అంటే మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు DLS లెక్క ప్రకారం ముందంజలో ఉంది.
DLS పద్ధతిలో వికెట్లు పడినా పెద్దగా ప్రభావం ఉండదని భావించడం తప్పు. వికెట్లు, మిగిలిన ఓవర్లు రెండూ కీలకమే. ఈ రెండింటి ఆధారంగా రన్ సాధించే వనరులను లెక్కిస్తారు. అందుకే కొన్ని సందర్భాల్లో తక్కువ స్కోరు చేసిన జట్టు కూడా DLS నిబంధనల ప్రకారం విజయం సాధించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..