Avanish Rao Aravelly: ఐపీఎల్-2024 సీజన్ కోసం మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. దుబయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ వేంలో తెలంగాణకు చెందిన ఓ యువ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్ దొరికింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ యువ వికెట్ కీపర్‌కు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అవకాశం ఇచ్చింది. ఎంతోమందిని తీర్చిన దిద్దిన ధోనీ సారథ్యంలో ఆడడంతో ఈ యువ ప్లేయర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అది కూడా ముఖ్యంగా వికెట్ కీపింగ్‌లో నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఓ చక్కిన అవకాశం లభించింది. ఇంతకీ ఎవరు ఈ అబ్బాయి, స్వస్థలం ఎక్కడ, ఇంతకు ముందు కెరీర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
అరవెల్లి అవనీశ్ రావు (Avanish Rao Aravelly)హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తరపున ఆడుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామవాసి అయిన అవనీశ్ రావును చెన్నై జట్టు తన బేస్ ధర రూ. 20 లక్షలకే కొనుగోలు చేసింది. ఈ 18 ఏళ్ల వికెట్ కీపర్ తన హర్డ్ హిట్టర్ బ్యాటింగ్‌తోనూ మెరుపులు మెరిపించగలడు.
అవనీశ్ వచ్చే ఏడాది జనవరి 19న దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే అండర్-19 ప్రపంచకప్ జట్టులో ఎంపికయ్యాడు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన అండర్-19 నాలుగు జట్ల టోర్నీలోనూ తన సత్తా చాటాడు. భారత్-ఏ తరపున బరిలోకి దిగిన అవనీశ్.. భారత్-బిపై 163 పరుగులతో దుమ్మురేపాడు. అలాగే, విజయ్‌హజారే ట్రోఫీలోనూ హైదరాబాద్ తరపున సర్వీసెస్‌పై లిస్ట్-ఏలో ఎంట్రీ ఇచ్చాడు.
ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇటు కీపింగ్, అటు బ్యాటింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ యువ ప్లేయర్‌లోని ప్రతిభను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ టీం.. ఈ కుర్రాడిని సొంతం చేసుకుంది. చిన్ననాటి నుంచే క్రికెట్ పై ఇష్టం పెంచుకున్న ఈ యువ ప్లేయర్.. అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌తోపాటు, ఐపీఎల్ 2024లో అడుగుపెట్టనుండడంతో రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..