కంగారూలు.. ఆరేస్తారా.!

|

May 27, 2019 | 7:28 PM

అంతర్జాతీయ క్రికెట్‌ను దాదాపు దశాబ్దన్నర కాలం పాటు శాసించిన జట్టు ఆస్ట్రేలియా. ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుండదు. అన్నింట్లోనూ విజయం సాధిస్తుంది. ఇక ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంట్ అయితే ఆస్ట్రేలియాకు తిరుగులేదు. ఏ జట్టు కూడా అందనంత స్థాయిలో ఏకంగా ఐదు ప్రపంచకప్‌లు గెలుచుకుంది. భారత్, వెస్టిండీస్ జట్లు రెండేసి సార్లు ప్రపంచకప్ గెలిస్తే.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా జట్టు కాస్త బలహీన పడినట్లు కనిపిస్తున్నా వారిని […]

కంగారూలు.. ఆరేస్తారా.!
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌ను దాదాపు దశాబ్దన్నర కాలం పాటు శాసించిన జట్టు ఆస్ట్రేలియా. ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుండదు. అన్నింట్లోనూ విజయం సాధిస్తుంది. ఇక ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంట్ అయితే ఆస్ట్రేలియాకు తిరుగులేదు. ఏ జట్టు కూడా అందనంత స్థాయిలో ఏకంగా ఐదు ప్రపంచకప్‌లు గెలుచుకుంది. భారత్, వెస్టిండీస్ జట్లు రెండేసి సార్లు ప్రపంచకప్ గెలిస్తే.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా జట్టు కాస్త బలహీన పడినట్లు కనిపిస్తున్నా వారిని తక్కువ అంచనా వేయలేం. మెగా టోర్నీ వచ్చిందంటే చాలు వారి ఆటలో మార్పు కనిపిస్తుంది. ఎంత పెద్ద జట్టునైనా మట్టికరిపిస్తూ ట్రోఫీని ఎగరేసుకుపోవడం వారికి అలవాటు. ఇక ఈసారి కూడా ఆ జట్టు నూతన కెప్టెన్ ఆరోన్ ఫించ్ సారధ్యంలో భారీ ఆశలతో ప్రపంచకప్‌కు సిద్ధమైంది. ఇకపోతే కొద్దికాలంగా ఆస్ట్రేలియా జట్టు కష్టకాలం ఉందన్న విషయం తెలిసిందే. బాల్ టాంపరింగ్ వివాదం ఆ జట్టును పట్టి పీడిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో స్టార్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం పడింది. ఆ సమయంలో ఆసీస్ ఎన్నో ఘోరమైన, అవమానకరమైన ఓటములను కూడా చవి చూసింది. నూతన కెప్టెన్ ఫించ్ కూడా ఫామ్ కోల్పోయి సతమతమయ్యాడు. అయితే ప్రస్తుతం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మళ్ళీ జట్టులోకి వచ్చారు. రీసెంట్‌గా జరిగిన పాకిస్థాన్ సిరీస్‌లో ఫించ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా తన ఫామ్‌ను తిరిగి సంపాదించాడు. ఇక ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లలో స్మిత్.. తనని ఎందుకు టాప్ క్లాస్ ప్లేయర్ అని అంటారో మరోసారి తన ఆటతో నిరూపించుకున్నాడు. ఇలా ఒక్కొకటిగా ఆస్ట్రేలియా జట్టుకు శుభ పరిణామాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ జట్టు ప్రపంచకప్ ట్రోఫీనే టార్గెట్‌గా చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రపంచకప్‌లో ఘనమైన రికార్డు…

ప్రపంచకప్‌లో ఏ జట్టుకు లేని ఘనత ఆస్ట్రేలియా సొంతం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. 1987 తొలిసారి వారు ప్రపంచకప్ ట్రోఫీని గెలిచారు. ఆ తర్వాత రెండోసారి 1999లో గెలవగా.. అప్పటి నుంచి ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఓ ఎదురులేని శక్తిగా మారింది. ఆ తర్వాత 2003, 2007 సంవత్సరాలలో కూడా వరుసగా ప్రపంచకప్‌లను గెలుచుకుని హ్యాట్రిక్ సాధించింది. ప్రపంచకప్‌లో కూడా వరుసగా మూడు సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా అరుదైన రికార్డు సృష్టించింది. ఇక 2011లో జరిగిన మెగా టోర్నమెంట్‌లో కూడా ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. దీనితో ఐదు సార్లు ప్రపంచకప్ గెలిచి ఎవరికి అందనంత దూరంలో నిలిచింది. అలాగే ఈసారి కూడా కప్ గెలుచుకుని రికార్డు‌ను మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.

వార్నర్, స్మిత్ రాకతో…

దాదాపు ఏడాది పాటు నిషేధం తర్వాత స్టార్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చారు. దీనితో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో మరోసారి హాట్ ఫేవరెట్‌గా మారింది. వీరి రాకతో జట్టులో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయింది. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగలిగిన వార్నర్‌కు… స్మిత్ మెరుపులు తోడైతే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు గెలుపు నల్లేరు పై నడకేనని చెప్పాలి. అటు కెప్టెన్ అరోన్ ఫించ్, మాక్స్‌వెల్, స్టోయినిస్, షాన్‌మార్ష్, లియాన్, ఖ్వాజా, హాజిల్‌వుడ్, స్టార్క్, కమిన్స్ తదితరులతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. ఇకపోతే పాత గుర్తులను మర్చిపోయి.. ఆటగాళ్లందరూ చెలరేగితే ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇతర జట్లతో పోల్చితే ఆస్ట్రేలియా పోరాట పటిమ అసాధారణంగా ఉంటుంది. ఒత్తిడిలోనూ సర్వం ఒడ్డి పోరాడడం వారికే చెల్లుతుంది. దీంతో ఈసారి కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్ అనే చెప్పాలి.