పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజమ్.. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమానమని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా అన్ని జట్లూ వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే శుక్రవారం ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ అజేయ సెంచరీ చేశాడు. దీనిపై క్లార్క్ పై విధంగా స్పందించాడు.
‘బాబర్ అజమ్ టాప్ క్లాస్ ప్లేయర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్థాన్‌కు దొరికిన విరాట్ కోహ్లీ అతడు.. ఆ జట్టు సెమీస్, లేదా ఫైనల్స్‌కు చేరాలంటే.. ఈ క్రికెటర్‌పై ఆధారపడాల్సి ఉందని’ క్లార్క్ పేర్కొన్నాడు. ఇక ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజేయ శతకం సాధించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. దీనితో పాకిస్థాన్ 262 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టును హాష్మతుల్లా షాహిది(74 నాటౌట్), హజ్రతుల్లా జజాయి(49) బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ ఆడి గెలిపించారు.
ఇది ఇలా ఉండగా బాబర్ అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న బాబర్ అజమ్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గొప్పగా రాణించాడు. ఇక ఇప్పుడు రాబోయే ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.