
Aaryavir Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 168 బంతుల్లో 160 పరుగులు చేసి అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ భారీ స్కోరు చేసినా భారత యువ వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు. వైభవ్ సూర్యవంశీని దాటేందుకు 16 పరుగులు, అంబటి రాయుడు రికార్డును బద్దలు కొట్టేందుకు 18 పరుగులు తక్కువయ్యాయి.
ఆర్యవీర్‌కు 16 పరుగులే తక్కువ
భారత యువ వన్డేల్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే 170కి పైగా పరుగులతో రెండు భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2025 డిసెంబర్‌లో యూఏఈ అండర్-19 జట్టుపై 171 పరుగులు చేయగా, 2026 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగులు బాదాడు. ఇప్పుడు ఆర్యవీర్ 160 పరుగుల దగ్గర ఆగిపోవడంతో వైభవ్ అత్యధిక స్కోరును అందుకోలేకపోయాడు. అయినా ఈ ఇన్నింగ్స్‌తో భారత యువ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును చేర్చుకున్నాడు.
24 ఏళ్లుగా చెక్కుచెదరని రాయుడు రికార్డు
భారత అండర్-19 వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటికీ అంబటి రాయుడు పేరిటే ఉంది. 2002లో ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై రాయుడు అజేయంగా 177 పరుగులు చేశాడు. ఆ తర్వాత పలువురు యువ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడినా ఈ రికార్డును అందుకోలేకపోయారు. వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో రికార్డుకు చేరువగా వచ్చాడు. ఇప్పుడు ఆర్యవీర్ 160 పరుగులు చేసి మరోసారి ఈ రికార్డుపై చర్చకు తెరలేపాడు.
టాప్ స్కోరర్ల జాబితాలో చోటు
యూత్ వన్డేల్లో భారత ఆటగాళ్ల అత్యధిక స్కోర్ల జాబితాను పరిశీలిస్తే అంబటి రాయుడు 177 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ 175, 171 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచాడు. రాజ్ బావా 162 పరుగులతో మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ కూడా 160 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆర్యవీర్ కూడా 160 పరుగులతో మయాంక్ సరసన నిలిచాడు. అంటే రికార్డు చేజారినా, భారత యువ క్రికెట్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
తండ్రి పేరు నిలబెస్టిన ఆర్యవీర్
యూఏఈతో మ్యాచ్‌లో ఆర్యవీర్ మొదట క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నాడు. సెంచరీని 131 బంతుల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత వేగం పెంచి బౌండరీలతో పరుగుల వరద పారించాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 309 పరుగులు చేసింది. అంతకుముందు నేపాల్‌పై 70 పరుగులు చేసిన ఆర్యవీర్, ఇప్పుడు 160తో మరోసారి తన సత్తా చాటాడు. తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు గుర్తొచ్చేలా ఆడినా, పరిస్థితికి తగ్గట్టు ఇన్నింగ్స్ నిర్మించడం అతడి ఆటలో కనిపించిన మరో మంచి విషయం.