హిందూ మతంలో ఎవరైతే నిర్మలమైన హృదయంతో భగవంతుని ఆరాధిస్తారో అన్ని అనుబంధాల నుంచి విముక్తి పొంది వైకుంఠానికి చేరుకుంటారని నమ్మకం. అయితే భారతదేశంలోని అనేక ఆలయాలున్నాయి. ఒకొక్క ఆలయం ఒకొక్క పూజా సంప్రదాయాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా కొన్ని ఆలయల్లోని వింతలూ. రహస్యాలు నేటికీ మిస్టరీనే.. కొన్ని ఆలయాల్లో వింత సంప్రదాయాలను చూస్తే షాక్ తింటారు. అలాంటి ఒక వింత సాంప్రదాయం దేవుడికి గొలుసులతో కట్టి ఉంచడం. ఇలా ప్రజలు దేవుడిని ఎందుకు గొలుసులతో కట్టి ఉంచారో అర్థం చేసుకోవడం కష్టం.
ఈ ఆలయం ఎక్కడ ఉందంటే?
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ఉన్న కేవడ స్వామి ఆలయం భైరవుడికి అంకితం చేయబడింది. ఇక్కడ భైరవుడు 600 సంవత్సరాలుగా కేవడ స్వామి రూపంలో పూజలందుకుంటున్నాడు. కాల భైరవుడు ఎల్లప్పుడూ తన భక్తులను ఆశీర్వదిస్తాడని.. తనను పూజించిన భక్తులకు సంబంధించిన ప్రతికూల శక్తులు ఇంటి నుండి వెళ్లిపోతాయని నమ్ముతారు. అంతేకాదు కాలభైరవుడిని పూజించడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు. కాల భైరవుడిని శివుని రూపంగా భావిస్తారు. కాల భైరవ అష్టమిని కాలాష్టమి అని కూడా అంటారు.
కాల భైరవ అష్టమి రోజున భైరవుడు ఆవిర్భవించాడనేది హిందువుల నమ్మకం. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే భైరవుని విగ్రహం ఇక్కడ గొలుసులతో కట్టి ఉంచబడింది. ఈ ఆలయంలో భైరవుడు.. బతుక్ భైరవ రూపంలో ఉన్నాడు. ఈ భైరవుని విగ్రహం రుద్రుని రూపంలో సింధూరం ధరించి బంగారు, వెండి కిరీటం ధరించి ఉంటుంది. ఈ భైరవ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భైరవుని దర్శనం చేసుకోవడానికి, పూజలు చేయడానికి భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.
గొలుసులతో బంధించి ఉంచడంలో రహస్యం
ఈ ఆలయంలో భైరవ బాబా విగ్రహాన్ని గొలుసులతో కట్టి ఉంచడానికి సంబంధించిన నమ్మకం ఏమిటంటే.. భైరవుడు పిల్లాడి రూపంలో నగరానికి వెళ్లి అక్కడ పిల్లలతో ఆడుకోవడం ప్రారంభించాడు. అలా బాలుడి రూపంలో పిల్లలతో ఆటలను ఆడుకుంటున్న సమయంలో భైరవుడికి ఏ విషయంలోనైనా కోపం వస్తే.. అప్పుడు పిల్లలను ఎత్తి అక్కడ ఉన్న చెరువులో పడవేసేవాడు. ఈ చర్యలను ఆపడానికి.. బైరవుడి ముందు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు భైరవుడు ఆలయం నుంచి కదలకుండా చేయడం కోసం గొలుసులతో బంధించడం మొదలు పెట్టారు.
మద్యం నైవేద్యం
ప్రతి సంవత్సరం భైరవ పూర్ణిమ, అష్టమి రోజున.. భైరవబాబా దర్శనం కోసం భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో దాల్ బాటిని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు ఇక్కడికి వచ్చే భక్తులు భైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు.
ఆలయ చరిత్ర
ఈ భైరవ ఆలయ చరిత్రలోకి వెళ్తే 1424 సంవత్సరంలో కేవడ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి ముందు.. ఝలా రాజ పుత్రుల కుటుంబానికి చెందిన కొంతమంది భైరవుడి విగ్రహాన్ని గుజరాత్ తీసుకువెళుతున్నారట. అప్పుడు భైరవుడి విగ్రహం ఉన్న వాహనం రత్నసాగర్ చెరువు గుండా వెళ్తున్నప్పుడు వాహన చక్రం ఆగిపోయింది. ఎంతకీ కదల లేదు. దీంతో భైరవుడిని ఇక్కడే ప్రతిష్టించారు. ఝాలా రాజవంశానికి చెందిన రాజు రాఘవ్ దేవ్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని నమ్మకం. అప్పటి నుంచి బాబా భైరవుడు ఝలా రాజ్‌పుత్ సమాజానికి కుటుంబ దేవతగా పూజలను అందుకుంటున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు