కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో చేసే నదీ స్నానానికి దీప దానానికి శివ కేశవుల పూజకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. కార్తీక మాసంలోని నెల రోజుల పాటు సూర్యోదయాని కంటే ముందే అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే ప్రవహించే నీటిలో స్నానం చేస్తారు. కార్తీక మాసం సహజంగానే చలి తీవ్రత మొదలయ్యే నెల. దీంతో ఈ చలికాలంలో శరీరం ధృడత్వాన్ని సంతరించుకునే విధంగానే కాదు వాతావరణానికి అనుగుణంగా తనని తాను మలచుకునెందుకు ఈ కార్తీక మాసంలో తెల్లవారు జామునే నదీ స్నానం నియమం పెట్టినట్లు ఉన్నారు పెద్దలు. చలిలో వేడి నీటితో స్నానం చేయవచ్చు.. అయితే చన్నీరుతో స్నానం చేయడం అత్యంత కష్టం.. ముఖ్యంగా నిల్వ ఉన్న నీరు మరింత చల్లగా ఉంటుంది. అదే భూ గర్భం నుంచి వచ్చిన నీరు నులి వెచ్చగా ఉండి స్నానం చేయడం వలన ఉదయం బద్ధకం తీరేలా ఉండడమే కాదు.. శరీరం వెచ్చగా ఉంటుంది. బహుశా అందుకనే మన పెద్దలు ఈ నెలల్లో నదీ స్నానం నియమం పెట్టి ఉంటారు.
నదీ స్నానం ఔషధ గుణాలు
కార్తీక మాసంలో వరద నీరు.. తేటగా మారుతుంది. రాళ్లనీ, వృక్షాలనీ రాసుకుంటూ సాగే నదులు.. ఆయా ఖనిజాలనీ, మూలికలనీ తమలో కలుపుకుని ప్రవహిస్తూ సాగిపోతూ ఉంటాయి. దీంతో నదీజలాలలో ఔషధీగుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయి కనుక .. ఈ నెలలో నదీ స్నానం ఆరోగ్యపరంగా మంచిది అని పెద్దలు నియమం పెట్టి ఉంటారు.
కార్తీక మాసంలో శక్తి వంతంగా చంద్రుడు
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ కార్తీక మాసాన్ని ‘కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధులతో తడిచిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని ఓ నమ్మకం. నదులను దైవంగా భావించి పూజిస్తారు. దీపాలు నీటిలో విడిచి పెట్టి భక్తిశ్రద్దలతో నీటిని పూజిస్తారు.
ఏ నదిలో లేదా ఇంట్లో స్నానం చేసినా సరే.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి.. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అంటూ నదులను కీర్తిస్తూ మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరిస్తారు.
ఈ కార్తీక మాసంలో తెల్లవారు జామునే నిద్ర లేచి నదుల వద్దకు చేరుకుని స్నానం చేసి సంకల్పం చెప్పుకుని పితృదేవతలను తల్చుకుని దాన ధర్మాలు చేస్తారు. అరటి కాండంలో దీపాలను వెలిగించి, భగవంతుడిని పూజిస్తారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..