AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే అశుభమా? శ్రీకృష్ణుడికే ఎదురైన పరిస్థితేంటో తెలుసా?

Ganesh Chaturthi Moon Darshan Telugu: గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడకూడదని ఎందుకు చెబుతారు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? పొరపాటున చంద్రుడిని చూస్తే ఏం చేయాలి? గణేశుడి శాపం, శ్రీకృష్ణుడి శ్యమంతక మణి కథతో ముడిపడిన ఈ నమ్మకం గురించి తెలుసుకోండి.

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే అశుభమా? శ్రీకృష్ణుడికే ఎదురైన పరిస్థితేంటో తెలుసా?
Ganesh Chaturthi Moon Darshan Telugu
Rajashekher G
|

Updated on: Sep 12, 2026 | 1:27 PM

Share

Ganesh Chaturthi Moon Darshan Telugu: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని గణేష్ చతుర్థిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14, సోమవారం వచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు గణపతి బప్పాను ఇళ్లకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే గణేష్ చతుర్థి రోజున పాటించే కొన్ని ప్రత్యేక నియమాల్లో చంద్రుడిని చూడకూడదనే నమ్మకం ఒకటి. ఈ రోజున చంద్రుడిని దర్శిస్తే అపవాదులు, నిందలు లేదా తప్పుడు ఆరోపణలు ఎదురయ్యే అవకాశం ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును కొన్ని ప్రాంతాల్లో ‘కలంక చతుర్థి’ అని కూడా పిలుస్తారు. అసలు గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు? దీనికి సంబంధించిన పురాణ కథ ఏమిటి? పొరపాటున చంద్రుడిని చూస్తే ఏం చేయాలి? తెలుసుకుందాం.

చంద్రుడిని గణేశుడు ఎందుకు శపించాడు?

పురాణ కథనాల ప్రకారం.. ఒకసారి చంద్రదేవుడు తన అందం, తేజస్సు గురించి గర్వించాడు. గణేశుడి ఏనుగు ముఖాన్ని, ఆయన ఆకారాన్ని చూసి పరిహాసంగా నవ్వాడని చెబుతారు. గణనాథుడు భక్తులు ఎంతో భక్తితో పెట్టిన నైవేద్యాలను స్వీకరించి నెమ్మదిగా వెళ్లడాన్ని చూసి పరిహాసం చేస్తాడు. ఈ క్రమంలో చంద్రుడి అహంకారానికి ఆగ్రహించిన గణేశుడు అతడిని శపించాడు. గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూసిన వ్యక్తిపై తప్పుడు అపవాదులు లేదా నిందలు వచ్చేలా శాపం విధించాడని పురాణ కథనం. తన తప్పును గ్రహించిన చంద్రదేవుడు గణేశుడిని ప్రార్థించి శాప విమోచనం కోరాడు. దీంతో గణేశుడు శాపాన్ని పూర్తిగా తొలగించకుండా, దాని ప్రభావాన్ని ఒక ప్రత్యేక రోజుకే పరిమితం చేశాడని విశ్వాసం. అప్పటి నుంచి గణేష్ చతుర్థి రోజున చంద్రదర్శనం చేయకూడదనే ఆచారం కొనసాగుతోందని చెబుతారు.

అందుకే ‘కలంక చతుర్థి’ అని పేరు

గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడటం వల్ల ‘కలంకం’ లేదా అపవాదు వస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజును కొన్ని సంప్రదాయాల్లో కలంక చతుర్థి అని పిలుస్తారు. ఈ నమ్మకానికి సంబంధించిన మరో ప్రముఖ కథ శ్రీకృష్ణుడు, శ్యమంతక మణికి సంబంధించినది.

ఇవి కూడా చదవండి

పురాణ కథనం ప్రకారం, శ్రీకృష్ణుడు కూడా ఒకసారి గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూశాడని, అనంతరం ఆయనపై శమంతక మణిని దొంగిలించాడనే తప్పుడు ఆరోపణ వచ్చిందని చెబుతారు. చివరకు శ్రీకృష్ణుడు ఆ ఆరోపణను తొలగించుకుని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడని కథనం. ఈ కథ ఆధారంగానే గణేష్ చతుర్థి రోజున చంద్రదర్శనం విషయంలో భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు.

పొరపాటున చంద్రుడిని చూస్తే ఏం చేయాలి?

అనుకోకుండా గణేష్ చతుర్థి రోజున చంద్రుడు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. దీనికి కొన్ని పరిహారాలను కూడా పురాణాలు, సంప్రదాయాలు సూచిస్తున్నాయి. పొరపాటున చంద్రుడిని చూసిన వారు గణేశుడిని భక్తిశ్రద్ధలతో స్మరించి, శమంతక మణికి సంబంధించిన కథను వినడం లేదా చదవడం పరిహారంగా భావిస్తారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఈ కథను భక్తితో శ్రవణం చేయడం ద్వారా చంద్రదర్శన దోషం తొలగిపోతుందని విశ్వాసం. అలాగే గణేశుడిని పూజించి, ఆయనకు ప్రార్థనలు చేయడం ద్వారా మనసులోని భయాన్ని తొలగించుకోవచ్చు.

నమ్మకం మాత్రమే.. భయపడాల్సిన అవసరం లేదు

గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడకూడదనే ఆచారం పురాణ కథలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా కొనసాగుతున్నదే. దీనిని శాస్త్రీయంగా నిరూపితమైన పరిణామంగా భావించాల్సిన అవసరం లేదు. అందువల్ల అనుకోకుండా చంద్రుడు కనిపించినా భయపడకుండా, గణేశుడిని స్మరించుకుని, తమ ఆచార విశ్వాసాల ప్రకారం పరిహారం చేసుకోవచ్చు.

(Disclaimer: ఈ కథనంలోని విషయాలు పురాణాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడినవి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us