Dodda Ganesha: కాణిపాకంలోనే కాదు.. ఇక్కడ కూడా రోజు రోజుకీ పెరిగే ఏకశిలా గణపతి.. వెన్నతో చేసిన అలంకరణ చూడాల్సిందే అంటున్న భక్తులు

|

Sep 10, 2021 | 4:55 PM

Dodda Ganesha: తొలిపూజలందుకునే గణపతిని హిందువులే కాదు.. అనేక దేశాల ప్రజలు పూజిస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హిందువుల ఇంట్లో సందడి మొదలవుతుంది.  గణపతి దేవాలయాలతో పాటు.. దేశ వ్యాప్తంగా..

Dodda Ganesha: కాణిపాకంలోనే కాదు.. ఇక్కడ కూడా రోజు రోజుకీ పెరిగే ఏకశిలా గణపతి.. వెన్నతో చేసిన అలంకరణ చూడాల్సిందే అంటున్న భక్తులు
Dodda Ganesha
Follow us on

Dodda Ganesha: తొలిపూజలందుకునే గణపతిని హిందువులే కాదు.. అనేక దేశాల ప్రజలు పూజిస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హిందువుల ఇంట్లో సందడి మొదలవుతుంది.  గణపతి దేవాలయాలతో పాటు.. దేశ వ్యాప్తంగా మండపాలలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ప్రముఖ క్షేత్రాల్లో కొలువనున్న ఒకొక్క గణపతి ఒకొక్క విశిష్టతను సొంతం చేసుకున్నాడు. రోజు రోజుకీ పెరుగుతున్న వినాయకుడు అంటే సర్వసాధారణంగా తెలుగువారికి కాణిపాకం వినాయకుడు గుర్తుకు వస్తాడు.. అయితే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మహానగరంలో కూడా ఒక వినాయకుడు రోజు రోజుకీ పెరుగుతున్నాడు.. అక్కడ చవితి వేడుకలకు ప్రసిద్ధి.. ఇక వెన్నతో చేసే అలంకరణ చూడడానికి భక్తులకు రెండు కళ్ళు చాలవంటారు. వినాయక చవితి సందర్భంగా దొడ్డ గణపతి దేవాలయం విశిష్టత,  స్థల పురాణం గురించి తెలుసుకుందాం..

దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు ఉంది. కన్నడంలో దొడ్డ అంటే ‘పెద్ద’ అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉంది. ఇది ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన గుడికి దగ్గరలో ఈ వినాయక ఆలయం ఉంది. ఈ దొడ్డగణపతి ఆలయాన్ని బెంగళూరు ను తీర్చిదిద్దిన కెంపెగౌడ నిర్మించారు.

ఆలయ చరిత్ర: 

ఒకసారి కెంపెగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు కనిపించాయట. అందులో ఒక్కదాని మీద వినాయక ప్రతిమను చూసి, వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద     విగ్రహాన్ని మలచమని ఆఙ్ఞాపించారట.  అప్పుడు మలచిన గణపతినే ఈరోజు మనం చూస్తున్న దొడ్డ గణపతి. ఎక్కడ ఆలయం గోపురం, దేవాలయం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకుడు  దొడ్డ గణపతి ఆలయం, బసవన్న గుడిని దర్శించకుండా వెళ్ళరు. దేవాలయంలోని దొడ్డ గణపతి ఏకశిలా విగ్రహం..  18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తారు.

బెంగళూరు ‘కరగ’ ఉత్సవ సంబరాలు

ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే … ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాదు కర్ణాటక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు.

స్వామి వారి అలంకరణ

వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు.  రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. వెన్న అలంకరణలో ఉన్న గణపతిని చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు. ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది.

ఆలయ సందర్శన సమయం: 

దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం 7 గంటల నుంచి 12. 30 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం 5. 30 గంట నుండి రాత్రి 8.30 గం. వరకూ ఉంటుంది. వినయ చవితి నుంచి ఉత్సవాలు వైభవం గా జరుపుతారు. ఇక ఈ ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి.

బసవన గుడి

దొడ్డ గణపతి ఆలయం సమీపంలో బసవన గుడి ఉంది. దీనిని ‘బుల్ టెంపుల్’ లేదా ‘వృషభ ఆలయం’ గా పిలుస్తారు. నందీశ్వరుడు ఆలయాల్లో కెల్లా అతి పెద్ద నంది ఆలయం ఇది.  15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉండే నంది విగ్రహాన్ని గ్రానైట్ రాతితో మలచారు. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఏడాదికొకసారి, డిసెంబర్ మాసంలో నిర్వహించే శనక్కాయల సంత (వేరుశెనగ పండగ) ప్రధాన ఆకర్షణ.

ఆలయ సందర్శన వేళలు : వారంలో అన్ని రోజులూ గుడి తలుపులు తెరిచే ఉంటారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 : 30 నుండి రాత్రి 9 గంటల వరకు.
చేరుకునే దారి:
బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్  రెండు రైల్వే స్టేషన్ లు ఉన్నాయి.  దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది.

Also Read:  సినీ ప్రముఖుల ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..