AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!

Bhadrapada Masam 2026 Festivals Telugu: 2026 భాద్రపద మాసం సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. వినాయక చవితి, ఋషి పంచమి, అనంత పద్మనాభ వ్రతం, మహాలయ పక్షాలు, ఏకాదశి, మాసశివరాత్రి వంటి ముఖ్యమైన పర్వదినాలు ఈ మాసంలో వస్తాయి. భాద్రపద మాసంలోని పండుగలు, వ్రతాలు, పుణ్యతిథుల పూర్తి వివరాలు తెలుసుకోండి.

భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
Bhadrapada Masam 2026 Festivals Telugu
Rajashekher G
|

Updated on: Sep 12, 2026 | 9:42 AM

Share

Bhadrapada Masam 2026 Festivals Telugu: తెలుగు పంచాంగంలో భాద్రపద మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. భక్తి, ఆధ్యాత్మిక చింతన, పితృదేవతల స్మరణ, దైవారాధనకు ఈ మాసం ప్రత్యేకంగా భావిస్తారు. ముఖ్యంగా వినాయక చవితి, ఋషిపంచమి, అనంత పద్మనాభ వ్రతం, మహాలయ పక్షాలు, మాసశివరాత్రి వంటి అనేక పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. అందుకే భాద్రపద మాసాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన కాలంగా భావిస్తారు.

భక్తి, ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైన మాసం

తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం దక్షిణాయన పుణ్యకాలంలో వస్తుంది. ఈ సమయంలో దైవారాధన, వ్రతాలు, పూజలు, ధ్యానం, పితృకార్యాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని సనాతన ధర్మ సంప్రదాయాలు చెబుతున్నాయి. భాద్రపద పౌర్ణమి సమయంలో చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల పరిధిలో సంచరించడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అనే పేరు వచ్చిందని పంచాంగ సంప్రదాయంలో పేర్కొంటారు. ఈ మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకవైపు విఘ్నేశ్వరుడి ఆరాధనకు అత్యంత ముఖ్యమైన వినాయక చవితి ఉంటే.. మరోవైపు పితృదేవతలను స్మరించుకునే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. ఇలా భాద్రపద మాసం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది.

భాద్రపద మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?

2026లో భాద్రపద మాసం సెప్టెంబర్ 12, శనివారం నుంచి అక్టోబర్ 10, శనివారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు, వ్రతాలు, పుణ్యతిథులు ఇవే..

ఇవి కూడా చదవండి
  • సెప్టెంబర్ 12, శనివారం: భాద్రపద శుద్ధ పాడ్యమి/విదియ, భాద్రపద మాస ప్రారంభం, చంద్రోదయం.
  • సెప్టెంబర్ 13, ఆదివారం: భాద్రపద శుద్ధ విదియ/తదియ, వరాహ జయంతి.
  • సెప్టెంబర్ 14, సోమవారం: భాద్రపద శుద్ధ చవితి – వినాయక చవితి

గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇదే రోజున తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో వినాయక చవితి ఉత్సవం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ మహాగణపతి వాక్యార్థ సభ కూడా ప్రారంభమవుతుంది.

  • సెప్టెంబర్ 15, మంగళవారం: భాద్రపద శుద్ధ చవితి/పంచమి – ఋషి పంచమి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరుగుతుంది. తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజున మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కూడా జరుపుకుంటారు.

  • సెప్టెంబర్ 17, గురువారం: భాద్రపద శుద్ధ షష్టి.. కన్యా సంక్రమణం, విశ్వకర్మ జయంతి.
  • సెప్టెంబర్ 18, శుక్రవారం: భాద్రపద శుద్ధ సప్తమి.. తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి పవిత్రోత్సవాలు సమాప్తమవుతాయి.
  • సెప్టెంబర్ 19, శనివారం: భాద్రపద శుద్ధ అష్టమి.. తిరుమల శ్రీవారి గరుడసేవ.
  • సెప్టెంబర్ 20, ఆదివారం: భాద్రపద శుద్ధ నవమి.. తిరుమల శ్రీవారి రథరంగ డోలోత్సవం, శ్రీ కేదారేశ్వర వ్రతం.
  • సెప్టెంబర్ 21, సోమవారం: భాద్రపద శుద్ధ దశమి.. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు, జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
  • సెప్టెంబర్ 22, మంగళవారం: భాద్రపద శుద్ధ ఏకాదశి.. పరివర్తన ఏకాదశి, వామన జయంతి. తిరుమల శ్రీవారి రథోత్సవం కూడా జరుగుతుంది.
  • సెప్టెంబర్ 23, బుధవారం: భాద్రపద శుద్ధ ద్వాదశి.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ అవభృథ స్నానం, చక్రస్నానం.
  • సెప్టెంబర్ 24, గురువారం: భాద్రపద శుద్ధ త్రయోదశి.. పక్ష ప్రదోషం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
  • సెప్టెంబర్ 25, శుక్రవారం: భాద్రపద శుద్ధ చతుర్దశి.. అనంత పద్మనాభ స్వామి వ్రతం, తిరుమల శ్రీవారి చక్రస్నానం, వినాయక నిమజ్జనం.
  • సెప్టెంబర్ 26, శనివారం: భాద్రపద శుద్ధ పౌర్ణమి.. ఉమామహేశ్వర వ్రతం, మహాలయ పక్షాలకు శ్రీకారం.
  • సెప్టెంబర్ 27, ఆదివారం: భాద్రపద బహుళ పాడ్యమి.. మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. పితృదేవతలను స్మరించుకోవడం, వారి పేరుతో తర్పణాలు, శ్రాద్ధకర్మలు చేయడం వంటి ఆచారాలకు ఈ కాలంలో ప్రాధాన్యత ఉంటుంది.
  • సెప్టెంబర్ 28, సోమవారం: భాద్రపద బహుళ విదియ.. శ్రీ మహాగణపతి వాక్యార్థ సభ సమాప్తం.
  • సెప్టెంబర్ 29, మంగళవారం: భాద్రపద బహుళ తదియ.. బృహత్యుమా వ్రతం, ఉండ్రాళ్ల తదియ, మహాభరణి, సంకష్టహర చతుర్థి.
  • అక్టోబర్ 2, శుక్రవారం: భాద్రపద బహుళ షష్టి.. మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
  • అక్టోబర్ 3, శనివారం: భాద్రపద బహుళ అష్టమి.. మధ్వాష్టమి.
  • అక్టోబర్ 6, మంగళవారం: భాద్రపద బహుళ ఏకాదశి.. జయ ఏకాదశి, ఇంద్ర ఏకాదశి.
  • అక్టోబర్ 8, గురువారం: భాద్రపద బహుళ త్రయోదశి.. పక్ష ప్రదోషం, మాసశివరాత్రి. మహాలయ అమావాస్యతో భాద్రపద మాసం ముగింపు

అక్టోబర్ 10, శనివారం: భాద్రపద బహుళ అమావాస్య.. మహాలయ అమావాస్య, పితృ దినం. బతుకమ్మ పండుగ ప్రారంభం, కుశ గ్రహణం వంటి విశేషాలు ఈ రోజున ఉంటాయి. మహాలయ అమావాస్యతో భాద్రపద మాసం ముగుస్తుంది. పితృదేవతలను స్మరించుకోవడానికి, కుటుంబ పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి ఈ రోజుకు విశేష ప్రాధాన్యత ఉందని సంప్రదాయ విశ్వాసం.

భాద్రపద మాసం ఎందుకు ప్రత్యేకం?

భాద్రపద మాసం అంటే కేవలం పండుగల సమాహారం మాత్రమే కాదు. వినాయకుడి ఆరాధనతో ప్రారంభమై, వ్రతాలు, పూజలు, ఏకాదశి, ప్రదోషం, శివరాత్రి, పితృకర్మలు వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ మాసం వేదికగా నిలుస్తుంది. వినాయక చవితి సందర్భంగా విఘ్నాలను తొలగించే గణపతిని ఆరాధించడం, ఋషి పంచమి సందర్భంగా ఋషులను స్మరించడం, అనంత పద్మనాభ వ్రతం ఆచరించడం, మహాలయ పక్షాల్లో పితృదేవతలను తలచుకోవడం వంటి సంప్రదాయాలు ఈ మాసానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.

అందుకే భాద్రపద మాసాన్ని భక్తి, నియమం, దైవచింతన, పితృస్మరణకు పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో తమకు వీలైన విధంగా దైవారాధన, సేవ, ధ్యానం, దానం వంటి సత్కార్యాలు చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ప్రశాంతతను పొందవచ్చని విశ్వాసం.

(Disclaimer: ఈ కథనంలోని పండుగలు, వ్రతాలు, తిథుల తేదీలు ప్రాంతీయ పంచాంగం, సూర్యోదయ–సూర్యాస్తమయ సమయాల ఆధారంగా స్వల్పంగా మారవచ్చు. స్థానిక పంచాంగాన్ని పరిశీలించి ఆచరించడం మంచిది.)

Follow Us