27 ఏళ్లుగా రోజూ శబరిమల కొండపైకి.. 68ఏళ్ల ఈ వ్యక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

శబరిమల కొండ ఎక్కడమంటేనే మహా మహా బలవంతులకు సైతం కఠిన పరీక్ష.. అలాంటిది 68 ఏళ్ల వయసులో, గత 27 ఏళ్లుగా దాదాపు ప్రతిరోజూ ఆ కొండను పరుగెత్తినంత వేగంగా ఎక్కుతున్నాడంటే నమ్ముతారా? దట్టమైన అడవి.. ఏనుగులు, పులులు సంచరించే ప్రమాదకర దారి.. ఆలయం మూసి ఉన్నా సరే, చంకలో పేపర్ల కట్టతో ఆయన ప్రయాణం మాత్రం ఆగదు. ఆయనే శ్రీధరన్. ఆయన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

27 ఏళ్లుగా రోజూ శబరిమల కొండపైకి.. 68ఏళ్ల ఈ వ్యక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Sabarimala Newspaper Vendor Sreedharan

Updated on: Nov 24, 2026 | 4:53 PM

శబరిమల యాత్రలో పంబ నుంచి సన్నిధానానికి చేరుకునే సుమారు 5 కిలోమీటర్ల కఠినమైన కొండ మార్గం ప్రతి భక్తుడి భక్తికి ఒక పరీక్ష. నీలిమల, అప్పాచిమేడు వంటి నిట్టనిలువు ఎత్తులను ఒక్కసారి ఎక్కడానికే యువకులు సైతం ఆయాసపడిపోతుంటారు. కానీ 68 ఏళ్ల శ్రీధరన్ మాత్రం గత 27 ఏళ్లుగా దాదాపు ప్రతిరోజూ ఆ కొండను పరుగెత్తినంత వేగంగా ఎక్కుతూ భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుత మండల-మకరవిళక్కు సీజన్‌లో వేలాది మంది భక్తుల రద్దీ మధ్య శ్రీధరన్ చకచకా కొండ ఎక్కుతూ సన్నిధానంలోని దుకాణాలు, కార్యాలయాలకు సుమారు 250 వార్తాపత్రికలను పంపిణీ చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆలయం మూసి ఉన్న రోజుల్లో కూడా ఆయన తన ప్రయాణాన్ని ఆపరు. సన్నిధానంలో ఉండే ప్రధాన అర్చకులు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 15 మందికి పేపర్లు అందించేందుకు ఉదయం 9 గంటలకు పంబ నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు తిరిగి చేరుకుంటారు. పత్రికలకు సెలవు ఉన్న రోజుల్లో లేదా తాను అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినప్పుడు మాత్రమే ఆయన ఈ కొండ ఎక్కడం మానుకుంటారు.

ఏనుగు దాడికి వస్తే.. కళ్లు మూసుకుని ప్రార్థించా..

పెరియార్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం గుండా సాగే ఈ దారిలో ఏనుగులు, పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి శబరిపీఠం వద్ద అప్పుడే ప్రసవించిన ఓ ఆడ ఏనుగు తనపైకి ఘీంకరిస్తూ దూసుకొచ్చిన భయానక అనుభవాన్ని శ్రీధరన్ గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ ఏనుగు ఘీంకరిస్తూ నా వైపు వేగంగా రావడంతో ప్రాణాలు పోయాయని అనుకున్నాను. భయంతో కళ్లు మూసుకుని స్వామీ అయ్యప్పా, నన్ను రక్షించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. కాసేపటి తర్వాత కళ్లు తెరిచి చూస్తే ఆ ఏనుగు ఎటు వెళ్లిందో అస్సలు కనిపించలేదు. అయ్యప్ప దయ ఉంటే అడవి జంతువులు కూడా మనకు ఏమీ చేయవు’’ అని ఆయన తన అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

తల్లి మరణంతో మారిన జీవితం

కేరళలోని వయనాడ్‌కు చెందిన శ్రీధరన్ గతంలో పేపర్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసేవారు. 1992లో తల్లి మరణించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆయన, కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయానికి వెళ్లి ఏడాదిన్నర పాటు మౌనవ్రతం పాటించారు. ఆ సమయంలోనే ఆయన మనసు శబరిమల వైపు మళ్లింది. 2000 సంవత్సరంలో శబరిమలకు చేరుకున్న ఆయన అప్పటి నుంచి పంబనే తన శాశ్వత నివాసంగా మార్చుకున్నారు. పెళ్లి చేసుకోకుండా, బంధువులకు దూరంగా ఉంటూ అయ్యప్ప సేవలోనే తన జీవితాన్ని గడుపుతున్నారు.

68 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఆరోగ్యం

ప్రతిరోజూ కొండ ఎక్కడం వల్లే తనకు ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని, అలసట అనేదే తెలియదని శ్రీధరన్ చెబుతున్నారు. ఈ శారీరక దృఢత్వమే ప్రతి ఏటా మంచు కొండల్లో సాగే కఠినమైన అమర్‌నాథ్ యాత్రను సైతం సులభంగా పూర్తి చేసేందుకు తనకు తోడ్పడుతోందని ఆయన ఆనందంగా వివరించారు. ఒకవైపు జీవనోపాధి, మరోవైపు నిత్యం అయ్యప్ప దర్శనం కోసం సాగుతున్న ఈ వృద్ధుడి ప్రయాణం ఎందరో భక్తులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us