మనందరి మాత భారత మాత… ఆరెస్సెస్ చీఫ్!

RSS Chief Mohan Bhagwat Speech at MJ Market in Hyderabad, మనందరి మాత భారత మాత… ఆరెస్సెస్ చీఫ్!

భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనం కన్నుల పండువగా కొనసాగుతోంది. భక్తుల కోలాహలం మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, సరూర్‌నగర్‌ చెరువు, మీరాలం ట్యాంక్‌, దుర్గం చెరువు తదితర ప్రాంతాల్లో క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇక వినాయక నిమజ్జన ఉత్సవాన్ని తిలకించేందుకు తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్.. చార్మినార్ నుంచి బయలుదేరి భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధుల సారథ్యంలో మొజాంజాహి మార్కెట్‌కు చేరుకున్నారు. అంతకుముందు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ.. శక్తికి ప్రతిరూపం అని, పార్వతీదేవి ప్రియపుత్రుడని వ్యాఖ్యానించారు. భక్తితోనే గణాధ్యక్ష పదవిని పొందిన చరిత్ర వినాయకుడిదని, భక్తితో పాటు మంచి ఆలోచనలు కూడా ఉండాలని అన్నారు.

మన అందరి మాత.. భారత మాత అని, జగన్మాతను మించిన దైవం లేదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మనందరం ఒకటే సమాజమని అన్నారు. అందరి దోషాలు, తప్పులను గణేశుడు తన బొజ్జలో దాచుకుంటాడన్నారు. ప్రతి ఒక్కరి మాట, ఆలోచనను దేవుడు వినగలడని చెప్పారు. మన బలాన్ని పేదలు, సమాజం బాగుకు ఉపయోగించాలని భగవత్‌ సూచించారు. మంచి ఆలోచనలు చేసే వ్యక్తికి గణనాథుడు మంచి చేస్తాడన్నారు. హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *