గోల్డ్‌ కాయిన్‌లతో ఎర వేశాడు..అధిక వడ్డీ ఆశ చూపాడు.. ముత్తూట్‌ ఫైనాన్స్‌ గోల్డ్‌ స్కాంలో ఏం జరిగిందంటే..

అధిక వడ్డీ ఆశ చూపాడు. గోల్డ్‌ కాయిన్‌లతో ఎర వేశాడు. ముత్తూట్‌ ఆఫీసులోనే సైడ్‌ బిజినెస్‌ పెట్టేశాడు. అంతా నిజమే అనుకున్నారు కస్టమర్లు. మేనేజరే నమ్మ బలకడంతో భారీగా బంగారం ముట్టజెప్పారు. కట్‌ చేస్తే..

  • Sanjay Kasula
  • Publish Date - 4:16 pm, Fri, 20 November 20

Muthoot Gold Scam Case : అధిక వడ్డీ ఆశ చూపాడు. గోల్డ్‌ కాయిన్‌లతో ఎర వేశాడు. ముత్తూట్‌ ఆఫీసులోనే సైడ్‌ బిజినెస్‌ పెట్టేశాడు. అంతా నిజమే అనుకున్నారు కస్టమర్లు. మేనేజరే నమ్మ బలకడంతో భారీగా బంగారం ముట్టజెప్పారు. కట్‌ చేస్తే.. అంతా నిండా మునిగారు. లెక్కెస్తే మూడు కిలోలకు పైగా బంగారంతో ఉడాయించాడు ఆ మేనేజర్‌.

విజయవాడ పడమటలో కలకలం రేపిన.. ముత్తూట్‌ ఫైనాన్స్‌ గోల్డ్‌ స్కాంలో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడైన మాజీ మేనేజర్‌ వీరబాబు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లో ఉన్న్టటు పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెబుతున్నారు.

ముత్తూట్‌ బ్రాంచిలో జరిగిన మోసంతో సంస్థకు సంబంధం లేదంటున్నాడు రీజనల్‌ మేనేజర్‌. వీరబాబు వ్యక్తి గతంగా ఈ నేరానికి పాల్పడ్డాడని.. ముత్తూట్‌ ఖాతాదారుల బంగారమంతా సేఫ్‌గా ఉందని చెబుతున్నాడు. బాధితులకు న్యాయం జరిగేందుకు సహకరిస్తామంటున్నాడు.

రీజనల్‌ మేనేజర్‌ మాటలు ఇలా ఉంటే.. బాధితుల వర్షన్‌ మరోలా ఉంది. ముత్తూట్ సిబ్బంది అందరికీ తెలిసే ఈ మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. దర్జాగా‌ ఆఫీసులోనే తమ బంగారం తీసుకున్నాడని.. తమకు ముత్తూట్‌ లోగో ఉన్న గోల్డ్‌ కాయిన్స్‌ ఇచ్చాడని అంటున్నారు.

మోసపోయిన బాధితులు పడమట ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ రీజనల్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ బంగారం తమకు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.