స్మిత్ డబుల్ ధమాకా.. ఆసీస్ భారీ స్కోర్!

Steve Smith slams 26th Test ton Aussies In Command, స్మిత్ డబుల్ ధమాకా.. ఆసీస్ భారీ స్కోర్!

యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరమైన అతడు ఈ టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్నాడు. తనంతట తాను వికెట్‌ ఇస్తే అదే గొప్పని వారు భావించేలా భీకర ఫామ్‌తో పరుగులు చేస్తున్నాడు. స్మిత్ డబుల్ సెంచరీతో మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 170/3తో గురువారం ఆట కొనసాగించిన ఆసీస్‌… స్మిత్‌కు తోడు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (127 బంతుల్లో 58; 8 ఫోర్లు), లోయరార్డర్‌లో మిచెల్‌ స్టార్క్‌ (58 బంతుల్లో 54 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు అందుకుంది. అంతకుముందు స్మిత్‌కు 118 పరుగుల వద్ద స్పిన్నర్‌ లీచ్‌ బౌలింగ్‌లో నోబాల్‌ రూపంలో లైఫ్‌ లభించింది.

దీనిని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ(211; 310 బంతుల్లో)ని సాధించాడు. అనంతరం పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు యత్నించి ఔటయ్యాడు. చివర్లో స్టార్క్, లయన్‌ (26 బంతుల్లో 26; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. అంతేకాకుండా చివరి 10 ఓవర్లలో 80పైగా పరుగులు రావడం విశేషం.

ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్‌ డెన్లీ (4) వికెట్‌ కోల్పోయి 23 పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *