మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి విపక్షాలు బీజేపీ-శివసేనకు సవాలు విసరగలవా? లేక ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లాగే మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు పునరావృతం అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదంతా పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో శివసేన-బీజేపీ పొత్తు కొనసాగుతుందా.. లేక ఆ రెండూ విడివిడిగా ఎన్నికల బరిలోకి దిగుతాయా అనే ప్రశ్న వస్తోంది.లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండూ సగం సగం సీట్లలో పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ లోక్‌సభ ఎన్నికల్లో లభించిన చారిత్రక విజయం తర్వాత శివసేనకు అన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేమని బీజేపీ స్పష్టం చేసింది.బీజేపీలోని ఒక వర్గం తమ పార్టీ సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోగలదని చెబుతోంది. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పదేపదే పొత్తు గురించి మాట్లాడుతున్నారు.
ఇక మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లను బీజేపీ-శివసేన పంచుకోవడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలైన బీజేపీ-శివసేన మధ్య సీట్ల పంపకాలు భారత్-పాక్ విభజన సమస్య కన్నా కష్టతరమైనదని ఆయన అభివర్ణించారు. ఈ క్లిష్టతరమైన సీట్ల పంపకాలపై త్వరలో రెండు పార్టీలు తుది నిర్ణయానికి వస్తాయని వెల్లడించారు.
”సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. ఇరు పార్టీల అగ్ర నేతలు దీనిపై చర్చలు జరుపుతున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాం.” అని సంజయ్ రౌత్ అన్నారు.
సోమవారం రాత్రి సీట్ల విషయంలో బీజేపీ-శివసేన నేతల మధ్య జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని శివసేన వర్గాలు తెలిపాయి. 10 సీట్ల విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నట్లు వారు చెప్పారు. మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉన్నా, సీట్ల సంఖ్యపై స్పష్టత లేనందున దాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో బీజేపీకు 122 సీట్లు, శివసేనకు 63 స్థానాలు ఉన్నాయి. శివసేన ఎన్డీయేలోనే ఉన్నా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మొత్తం 48 స్థానాల్లో 41 సీట్లను కైవసం చేసుకుంది. శాసనసభ ఎన్నికలు మహారాష్ట్రలో అక్టోబరు 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు అదే నెల 24న జరగనుంది.
గత ఐదేళ్లలో ఏం జరిగింది?
శివసేన-బీజేపీ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ రెండు పార్టీలు ఎప్పుడూ గొడవలతో వార్తల్లో నిలుస్తూ వచ్చాయి.శివసేన ప్రభుత్వంలో భాగం కాలేదు. కానీ బీజేపీ రాజకీయ, ఆర్థిక విధానాలను తప్పుబడుతూ ఎప్పుడూ దూకుడు చూపించేది. బహుశా విపక్షాలు కూడా అంతగా వ్యతిరేకించ లేకపోయాయి.నోట్లరద్దు అయినా, ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ అయినా, ముంబయి మెట్రో ఆరే కార్‌షెడ్‌పై నిరసనలు అయినా… శివసేన చాలాసార్లు బీజేపీని వ్యతిరేకిస్తూ కనిపించింది.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో బీజేపీ-శివసేన విజయం సాధించాయి. అవి పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలైనా శివసేన-బీజేపీ విడివిడిగా పోటీచేశాయి. కానీ, విపక్షాలకు మాత్రం ఎలాంటి అవకాశం దక్కలేదు.ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండింటి మధ్యా గట్టిపోటీ నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి శివసేన చేతుల్లో ఉన్న ముంబయి ఆ పార్టీ చేజారుతుందేమో అనిపించింది. కానీ ఇద్దరు కార్పొరేటర్ల మెజారిటీతో శివసేన మరోసారి ముంబయిని సొంతం చేసుకుంది. అయితే, ఇన్ని గొడవలు వచ్చినా ప్రభుత్వంలో కొనసాగుతూనే వచ్చింది.
శివసేన.. బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా చేయడంతో రాజకీయ కలకలం కూడా రేగింది. ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే భూకుంభకోణం ఆరోపణలతో రాజీనామా కూడా చేశారు.పంకజ్ ముండే, వినోద్ తావాడే లాంటి మంత్రులపై కూడా విపక్షాలు ఆరోపణలు చేశాయి. కానీ వారి పదవులకు మాత్రం ఎలాంటి ప్రమాదం రాలేదు.