
కావలసిన పదార్థాలు: 1 కప్పు స్వచ్ఛమైన రాగి పిండి, 1 కప్పు తురిమిన బెల్లం, బెల్లం కరిగించడానికి 2 కప్పులు నీళ్లు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, మంచి సువాసన కోసం పావు టీస్పూన్ యాలకుల పొడి, కొద్దిగా జీడిపప్పు పలుకులు.. ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు.

తయారీ విధానం: స్టవ్‌పై అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిగిలిన నేతిలో 1 కప్పు రాగిపిండిని వేయాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో ఆపకుండా కలుపుతూ 8 నుండి 10 నిమిషాల పాటు రాగిపిండి కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన ఉంచాలి. ఈ హల్వా రుచి మొత్తం పిండి వేయించడంలోనే ఉంటుంది, మాడకూడదు.

వేరొక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. ఎటువంటి పాకం అవసరం లేదు; బెల్లం పూర్తిగా కరిగి బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఉన్న సమయంలోనే.. వేడి బెల్లం నీటిని జల్లెడతో వేయించి ఉంచుకున్న రాగిపిండి పాన్‌లోకి వడకట్టుకోవాలి. నలకలు తొలగిపోతాయి. స్టవ్ వెలిగించకుండానే విస్కర్ లేదా గరిటెతో రాగిపిండి, బెల్లం నీరు ఉండలు ఏమీ లేకుండా పూర్తిగా కలిసిపోయేలా కలపాలి.

పిండి ఉండలు లేకుండా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి లో-మీడియం మంటపై పెట్టాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించాలి. చివరగా మూడవ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి; హల్వా పాన్‌కు అంటుకోకుండా ముద్దలా కదులుతూ అంచుల నుండి నెయ్యి వేరుపడటం మొదలవుతుంది.

ఇప్పుడు పావు టీస్పూన్ యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'రాగి హల్వా / రాగి తోప' సిద్ధం! వేడివేడిగా తింటుంటే నేతి సువాసనతో వెన్నలా కరిగిపోతూ పిల్లల నుండి పెద్దల వరకు అమితమైన బలాన్ని, రక్తాన్ని చేకూరుస్తుంది!