
సాధారణంగా జైలు అనగానే నాలుగు గోడల మధ్య చీకటి గదులు, చేతులకు బేడీలు, కఠినమైన పనులు, నాసిరకం ఆహారం గుర్తొస్తాయి. కానీ, ప్రపంచంలో కొన్ని దేశాల జైళ్లు ఫైవ్ స్టార్ రిసార్టులను తలపిస్తాయి. ఇక్కడి సౌకర్యాలు చూస్తే సామాన్యులకు సైతం అసూయ కలగక మానదు. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన జైళ్లు, వాటిలోని సదుపాయాల గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాస్టోయ్ జైలు, నార్వే : ఇదొక విచిత్రమైన ద్వీపకల్ప జైలు. ఇక్కడ ఖైదీలను గదుల్లో బంధించరు. వారు ఒక చిన్నపాటి గ్రామం లాంటి వాతావరణంలో కాటేజీలలో నివసిస్తారు. గుర్రపు స్వారీ, టెన్నిస్ ఆడటం, సముద్రంలో చేపలు పట్టడం, సన్‌బాత్ చేయడం వంటివి ఇక్కడి ఖైదీల రోజువారీ దినచర్యలు.

హాల్డెన్ జైలు, నార్వే : ప్రపంచంలోనే అత్యంత మానవీయమైన, లగ్జరీ జైలుగా దీనికి పేరుంది. ఇక్కడ ఖైదీలకు వ్యక్తిగత గదులు ఉంటాయి. వాటిలో అటాచ్డ్ బాత్‌రూమ్, ఫ్లాట్ స్క్రీన్ టీవీ, మినీ ఫ్రిజ్ ఉంటాయి. అంతేకాకుండా, ఖైదీలు తమ ఖాళీ సమయంలో ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, ట్రాక్‌లతో కూడిన రన్నింగ్ ఏరియా, ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

జస్టిజ్‌జెంట్రమ్ లీబెన్, ఆస్ట్రియా: బయట నుండి చూస్తే ఇదొక పెద్ద ఐటీ కంపెనీ లేదా మల్టీప్లెక్స్ మాల్ లాగా కనిపిస్తుంది. పూర్తిగా గాజు, స్టీల్‌తో నిర్మించిన ఈ జైలు లోపల ఖైదీలకు ప్రైవేట్ గదులు, స్పోర్ట్స్ కోర్టులు, కాన్ఫరెన్స్ హాలులు ఉన్నాయి. ఇక్కడి ఖైదీలు తమకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. నచ్చిన ఆహారాన్ని వారే స్వయంగా వండుకునే వీలుంది.

ఈ లగ్జరీ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?: ఖైదీలకు ఇన్ని ఐషారామ సౌకర్యాలు కల్పించడం వెనుక ఒక బలమైన సైన్స్, నసిక సిద్ధాంతం ఉంది. నార్వే వంటి స్కాండినేవియన్ దేశాలు పునరావాసం విధానాన్ని నమ్ముతాయి. నేరస్థులను హింసించడం వల్ల వారు మరింత క్రూరంగా మారతారని, అదే వారికి గౌరవప్రదమైన వాతావరణం కల్పిస్తే వారిలో పశ్చాత్తాపం కలిగి సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని ఈ దేశాల నమ్మకం. ఆశ్చర్యకరంగా, ఈ దేశాల్లో జైలు నుండి విడుదలయ్యాక మళ్లీ నేరాలు చేసే వారి శాతం ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉండటం విశేషం!