
ఆలూ టమాటో వెజిటేబుల్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బియ్యం 1 గ్లాసు, బంగాళదుంపలు, టమాటోలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, పసుపు, ఉప్పు, కారం, మిరియాలపొడి, ధనియాల పొడి, మినపప్పు, ఆవాలు, జీలక, ఎండుమిర్చి, కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగినది.ముందుగా, కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు బియ్యాన్ని వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి కుక్కర్ మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం పూర్తిగా ఉడికిపోతుంది. దానిని తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బంగాళదుంపలను పొట్టు తీసి, మరీ చిన్నవి కాకుండా, పెద్దవి కాకుండా మధ్యస్థ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలను ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపి, బంగాళదుంప ముక్కలను వేసి వేయించాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, కొంచెం ఉప్పు కూడా వేసి, ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.

ఇందులోనే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలపాలి. తర్వాత టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాలపొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. టమాటోలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించాలి.టమాటోలు సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను మొత్తం వేసేయాలి.

బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కాస్త వేయిస్తూ కుక్ చేయాలి. ఆ తర్వాత రెండు లేదా మూడు సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని కూడా వేసి బాగా కలిపేయాలి. రెండు, మూడు నిమిషాల పాటు మంటని మీడియం నుండి హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా టాస్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపితే ఆలూ టమాటో రైస్ రెడీ