
వింత గ్రామం.. అందులోనూ అక్కడ జరిగేది ప్రకృతి వింత. అది కూడా మన తెలంగాణలోనే.. పెద్దపల్లి జిల్లా కొదురుపాక గ్రామం అరుదైన ప్రకృతి వింతకు నిలయం. ఈ ఊరికి నలువైపులా ఎత్తైన కొండలు ఉండటంతో ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకే చీకటి అలుముకుంటుంది.

తూర్పున ఉన్న కొండల వల్ల సూర్యోదయం కూడా ఆలస్యంగానే అవుతుంది. సాధారణంగా ప్రపంచమంతా నాలుగు జాముల కాలాన్ని అనుభవిస్తుంటే, ఈ ఊరి ప్రజలు మాత్రం కేవలం మూడు జాములనే చూస్తారు. అందుకే దీనిని 'మూడు జాముల కొదురుపాక' అని పిలుస్తారు.

ఊరి చుట్టూ గొర్ల గుట్ట, రంగనాయకుల గుట్ట లాంటి ఎత్తైన కొండలు ఉండటం వల్ల ఉదయం 8 గంటల వరకు సూర్యుడు కనిపించడు. సాయంత్రం 4 గంటలు కాగానే పడమర వైపు ఉన్న కొండలు అడ్డు వచ్చి, సూర్యుడు అస్తమించినట్లుగా చీకటి అలుముకుంటుంది.

ఈ గ్రామం చుట్టూ గొర్ల గుట్ట, రంగనాయకుల గుట్ట, పాము బండ, నంబులాద్రి స్వామి గుట్ట అనే నాలుగు ఎత్తైన కొండలు ఉన్నాయి. ఈ కొండల భౌగోళిక అమరిక వల్ల సూర్యకిరణాలు గ్రామంపై పడటం ఆలస్యమవుతుంది. ఉదయం సుమారు 8 గంటల తర్వాతే ఇక్కడ వెలుతురు కనిపిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటలు కాగానే, పడమరన ఉన్న రంగనాయకుల గుట్ట అడ్డుగా రావడంతో సూర్యుడు అప్పుడే అస్తమించినట్లుగా మారిపోయి చిమ్మ చీకటి అలుముకుంటుంది. మధ్యాహ్నం తర్వాత నేరుగా రాత్రి అయిపోతుందా అన్న అనుభూతి ఇక్కడ కలుగుతుంది.

ఇటీవల విడుదలైన హీరో కిరణ్ అబ్బవరం 'క' సినిమాలో ఈ వింత గ్రామాన్ని చూపించారు. సినిమాలో చూపించినట్లే ఈ ఊరిలో కూడా సాయంత్రం అనేది ఉండదు. పగటి సమయం చాలా తక్కువ కావడంతో ఇక్కడి ప్రజలు తమ పనులను చాలా వేగంగా ముగించుకోవాల్సి ఉంటుంది. శతాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్థులు ఈ వింత వాతావరణానికి అలవాటు పడిపోయారు.