
జొన్న దిబ్బరొట్టె కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా, స్పాంజిలా ఉండే ఈ వంటకం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా, దీనిని తక్కువ నూనెతో తయారుచేయడం వలన ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కు కూడా మంచి బ్రేక్ ఫాస్ట్. జొన్న రవ్వతో చేసే ఈ దిబ్బరొట్టె తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి.

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పొట్టు మినప్పప్పు, ఒకటిన్నర తెల్ల జొన్న రవ్వ , ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం, 2 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకు ఆకులు, ఒక ఉల్లిపాయ 1 పెద్దది, ఇంకా తగినంత నూనెను తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పొట్టు మినప్పప్పును తీసుకోండి. పొట్టు మినప్పప్పు లేనివారు గుండు మినపప్పును కూడా వాడుకోవచ్చు. ఈ పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి ఐదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టాలి. పప్పు చక్కగా నానడం వల్ల పిండి మెత్తగా వస్తుంది. ఆరు గంటల తర్వాత నానిన మినప్పప్పును మిక్సీ జార్లో గానీ లేదా గ్రైండర్లో గానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

పిండి మరీ గట్టిగా లేదా మరీ లూస్‌గా కాకుండా, మధ్యస్థ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.ఇప్పుడు ఈ మినప్పిండిలోకి ఒకటిన్నర కప్పుల తెల్ల జొన్న రవ్వను కలపండి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పును కూడా వేసి, అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దిబ్బరొట్టె వేయడానికి సరిపడే కన్సిస్టెన్సీకి సర్దుబాటు చేసుకోవాలి. కలిపిన పిండి పైన మూత పెట్టి, ఒక రాత్రంతా పులియబెట్టాలి. పిండి పులవడం వల్ల దిబ్బరొట్టెలు మృదువుగా, స్పాంజిలా వస్తాయి.

మరుసటి రోజు ఉదయం, పులిసిన పిండిలోకి ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోండి. ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని లేదా నాన్-స్టిక్ పాన్‌ను పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక టీ స్పూన్ నూనె వేసి పాన్ అంతా అప్లై చేయాలి. పాన్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రెండు గరిటెలు వేసుకొని, మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి.

దీనిపైన మూత పెట్టి, స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి ఐదు నిమిషాల పాటు కాలనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దిబ్బరొట్టె పైభాగం పొడిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నూనె వేసి, రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మరో రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె రెడీ అయిపోయింది. దీన్ని పల్లి చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో గానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది.